ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాస్తామని చెప్పిన ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్లకు 2024 ఎన్నికల ముందైనా బీజం పడే అవకాశాలున్నాయా..? అంటే అవి కనుచూపు మేరలో కనిపించడంలేదనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం తరహాలో 75 ప్రభుత్వశాఖలన్నింటికీ కలిపి ఒకేచోట ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మిస్తామని జిల్లాల పునర్విభజన చేసే సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొత్తజిల్లాలు, పాత ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలా గుర్తింపు కూడా చేపట్టారు. ఏమైందో ఏమో తెలీదుగానీ ఆ నూతన విధాన కలెక్టరేట్ల వ్యవహారం అటకెక్కినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో కలెక్టరేట్లు ఉండగా.. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మాత్రం అద్దె భవనాల్లోనే కలెక్టరేట్లు నిర్వహణ జరుగుతోంది. కొన్ని జిల్లా కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అంతెందుకు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల నివాసాలు, క్యాంపు కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తజిల్లాల్లోని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి ఇలా అఖిలభారతస్థాయి అధికారులంతా అద్దెఇళ్లల్లో నివాసం ఉండాల్సి వస్తున్నది.
ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించే సమయంలోనే కలెక్టర్, జెసి, ఎస్పీలకు కూడా నివాస సముదాయాలు, క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని తలపెట్టింది. అయితే ఆ ప్రక్రియకు నేటి వరకూ బీజం పడలేదు. పడుతుందనే గ్యారెంటీ కూడా కనిపించడం లేదు. కలెక్టరేట్లతోపాటు, జిల్లా అధికారుల నివాస సముదాయాల నిర్మాణం చేపడితే కొత్త జిల్లాలకు వచ్చే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని ప్రభుత్వం కొత్త జిల్లాల విభజన సమయంలోనే ఆలోచన చేపట్టింది. హడావిడిగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అధికారుల నివాసాల నిర్మాణాలకు అనువైన ప్రభుత్వస్థలాలను కూడా గుర్తించారు. అదంతా అప్పట్లో కాగితాలకే పరిమితం అయిపోయింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కొత్తజిల్లాల్లో అక్కడి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మిస్తోంది. జిల్లా కలెక్టర్, జెసి, ఎస్పీ, ఫారెస్టు అధికారి మొదలుకొని అన్నిశాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు కూడా ఒకేచోట నిర్మాణం చేయడం ద్వారా ప్రజలకు కూడా సౌకర్యంగా వుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఎంతో గొప్పగాచేసిన ఆలోచనను మాత్రం కార్యాచరణలో ఒక్క అడుగు కూడా ముందుకి కదపలేకపోయింది. దీనితో కొత్త జిల్లాల్లో జల్లా అధికారులు, వారి కార్యాయాలు అద్దె కొంపల్లోన నడవాల్సి వస్తున్నది.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఏవిధంగా అందుతున్నాయో జిల్లా కేంద్రంలో కూడా అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఒకేచోట ఉంటే నిర్వహణ వ్యయ భారం భారీగా తగ్గుతుందని..దానికంటే ముఖ్యంగా వినూత్నంగా వుంటుందని కూడా ప్రభుత్వం యోచన చేసింది. కొత్తజిల్లాల్లో పరిపాలన ఏడాది దాటిపోయి రెండవ ఏడాదికి దగ్గరపడుతున్నా..ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణ ఆలోచనకు పునాదులు కూడా పడలేదు. దీనిపై జిల్లాల మంత్రులు కూడా పెద్దగా ద్రుష్టిసారించకపోవడం విశేషం. ఎంతసేపూ గ్రామాల్లో సచివాలయాలు, లైబ్రెరీలు, పిహెచ్సీల నిర్మాణాలు జరిగాయా లేదా అనే విషయాలను చూస్తున్నారు తప్పితే కొత్తజిల్లాలు ఏర్పడిన చోట ఉన్న మంత్రుల్లో ఒక్కరైనా తమ జిల్లాలో తొలుత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించి ప్రారంభించుకోవాలనే ఆలోచన చేయడం లేదు. ఉన్న సమయం పరిపాలనకు..లేదంటే ప్రతిపక్షాలపై ఎదురు దాడికే సమయం సరిపోతుందన్నట్టుగా ప్రజాప్రతినిధులు కూడా వ్యవహరిస్తున్నారు. అదిగో ఇదిగో అంటే ఇంకా 8నెలలు మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. అందులో మూడు నెలలు గడిచిపోతే..మిగిలిన సమయం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తే ఒక్క ప్రభుత్వ పనికూడా ముందుకి సాగే పరిస్థితి లేదు..సో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు విషయం ఈ ప్రభుత్వంలో అయితే మరిచిపోవచ్చు, లేదా శేషం మిగిలిపోయేలా ఆఖరు నిమిషంలో అంటే ఎన్నికలకు ముందు ఒకటి రెండైనా నిర్మాణాలు ప్రారంభించవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందనే వేచి చూడాల్సిందే..!