98డిఎస్సీ టీచర్లకి ఉద్యోగాలిచ్చారు..జీతాల మరిచారు..!


Ens Balu
120
Tadepalli
2023-06-15 09:55:32

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులుకి ఉద్యోగాలిచ్చి పేరు తెచ్చుకుంటే.. పాఠశాల విద్యాశాఖ వారికి జీతాలు ఇవ్వకుండా పస్తులుంచి వచ్చిన పేరుకి గాలి తీసేస్తున్నది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం రాష్ట్రవ్యాప్తం సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకి నేటికీ జీతాలు చేతికి అందలేదు. దానికి సాంకేతిక కారణం కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగికైనా హెచ్ఆర్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసి ఆ వివరాలను ట్రజరీలకు పంపాల్సి వుంటుంది. అలా పంపిన తరువాత మాత్రమే ఉద్యోగులకు సమయానికి జీతాలు పడతాయి. ఆ అకౌంట్ లేకపోయినా, తయారు కాకపోయినా మేస్టార్లంతా చక్కగా జీతాలు రాక పస్తులుండాల్సిందే. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనే అదే జరుగుతోంది. నేటికీ ఉద్యోగాలు పొందిన కాంట్రాక్టు 98 డిఎస్సీ ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఎంఎస్ ఐడి లు రాలేదు. ఆ విషయాన్ని అన్ని మండలాల ఎంఈఓలు నానుస్తున్నారు. కొన్నిచోట్ల డబ్బులిస్తేగానీ ఈ అకౌంట్లు క్రియేట్ చేయడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యోగాలొచ్చినా..జీతాలు రాకపోవడంలో ఉద్యోగాల్లోకి చేరిన ఉపాధ్యాయులంతా అప్పులు చేసుకొని విధులు నిర్వహిస్తూ కుటుంబ పోషణ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు గానీ ఎంఈఓలకు నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీచేయకపోవడంతో ఈ హెచ్ఆర్ఎంఎస్ ప్రక్రియ 
రాష్ట్రవ్యాప్తంగా సా...గుతోంది. దానితో ఉద్యోగాలొచ్చాయని ఆనందపడాలో..వచ్చిన తరువాత జీతాలు రాలేదని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.

మొదటి నెలలో పనిచేసిన 14 రోజులకి జీతాల బిల్లలు పెట్టాంటే కొత్తగా విధుల్లోకి చేరిన వారందరికీ సాలరీ అకౌంట్ల జాబితా ట్రజరీలకు సమర్పించాల్సి వుంటుంది. ఆ పైన సాలరీ బిల్లలు అప్లోడ్ చేస్తే అందరు ఉపాధ్యాయులతోపాటుగా వీరికి కూడా జీతాలొస్తాయి. లేదంటే ఎప్పటికీ జీతాలు వచ్చే పరిస్థితి ఉండదు. అలా చేయాలంటే ముందు హెచ్ఆర్ఎంఎస్ ఐడీలు తయారు చేయాల్సి వుంటుంది.ఈ విషయంలో ఉపాధ్యాయులు ఎంఈఓలను ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వేసవి సెలవులు అనంతరం విధులకు వెళ్లాలంటే ముందునెలలో చేసిన విధులకు కాస్తయినా జీతాలు పడితే జూన్ నెల కాస్త వెసులుబాటు కలుగుతుందని.. పోయిన నెలా అప్పులు చేసుకొని.. ఇప్పుడు కూడా అప్పులు చేసుకునే విధులకు వెళ్లాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, లాంటి జిల్లాల్లో ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ మారుమూల ఏజెన్సీలోని పాఠశాలల్లోనే నియమించారు. అక్కడ ఉపాధ్యాయులు నివాసం ఉండాలన్నా.. ఇళ్లకు అద్దెలు కట్టుకొని కుటుంబాలను పోషించుకోవాలన్నా కనీసం నెలకు 10 నుంచి 15వేల రూపాయల ఖర్చు..పాఠశాలలకు వెళ్లిరావడానికి నెలకు మరో రూ.5వేలు పెట్రోలుకి ఖర్చు వెరసి రూ.20 వేల వరకూ ఖర్చులు అవుతాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా ఎంఈఓలు ఈ ఉపాధ్యాయుల ఇబ్బందులపై కనికరించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విధుల్లోకి చేరిన ఉపాధ్యాయుల 
హెచ్ఆర్ఎంఎస్ ఐడీలు సత్వరమే ఆన్ లైన్ లో నమోదు చేసి బకాయి జీతాలు ఇప్పించాలని ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు..!

సిఫార్సు