ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం విద్యతో ఏం చేయాలో తోచక కార్పోరేట్ పాఠశాలలు నిలదొక్కుకోవడానికి అష్ట కష్టాలూ పడుతున్నాయి. ప్రభు త్వపాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలల్లో 90శాతం ఇంగ్లీషు మీడియం విద్య పక్కాగా వస్తుందనే విషయాన్ని తల్లిదండ్రుల మనసు మార్చేందుకు ట్రెండ్ ను మారుస్తున్నాయి. ఇపుడు ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజి, యూకేజిలో చేర్పించే సమయంలోనే పిల్లలు ఏవిధంగా చదువులో రాణించగలుగుతున్నారు..వారికి ప్రత్యేకంగా పాఠశాలల్లోనే ట్యూషన్ పెట్టించి ప్రభుత్వపాఠశాలలు ప్రైవేటు విద్యను చేరుకోలేవనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంలో పై చేయి సాధిస్తున్నారు. ఒకప్పుడు సాధారణ డిగ్రీ చదివిన వారిని ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించేవారు. కానీ ఇపుడు ఆయా సబ్జెక్టులను బోధించేందుకు, కనీసం డిఎడ్, బిఈడి, హిందీ పండిట్ ట్రైనింగ్ అయిన వారిని మాత్రమే నియమిస్తున్నారు. అదీ 25 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఏస్థాయిలో పిల్లలకు పాఠాలు ఇంగ్లీషులో చెప్పగలుగుతున్నారో చూసి మరీ వారికి ఉద్యోగాలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యమ విద్యాబోధనను తమ ప్రైవేటు పాఠశాలల్లో మెప్పించాలంటే అక్కడ ఉండే ఉపాధ్యాయుల కంటే మెరుగైన మెరికాల్లాంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే యాజమాన్యాలు నియమిస్తున్నాయి.
ఒకప్పుడు సాధారణ ఇంగ్లీషు మాద్యమ విద్య మాత్రమే చెప్పే ఈ కార్పోరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింటిలో నిర్వహిస్తు్న్నట్టు ప్రత్యేక ఇంగ్లీషు క్లాసులు పెడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పాఠశాలలు, యూనివర్శిటీల విద్యార్ధులు, అధ్యాపకులు, ఇతరులతో ఆన్ లైన్ లో ఇంట్రాక్షన్ లు కూడా పెడుతున్నారు. వాటికి అయ్యే ఖర్చును కూడా స్పెషల్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ క్రింద అదనంగా ఫీజులు తీసుకొని భోధిస్తున్నారు. నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ కి వచ్చేలోపుగా పిల్లలకు సాధారణ ఇంగ్లీషు వచ్చేవిధంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మాత్రమే ఇంగ్లీషు మాద్యమ విద్య అందుబాటులో ఉండేది. కానీ ఇపుడు ప్రైవేటు పాఠశాలల కంటే అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన విద్య అందుబాటులోకి రావడం, సెంట్రల్ సిలబస్ ను కూడా చెప్పిస్తుండటంతో ప్రైవేటు కార్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాలలు పెద్ద పోటీని ఇస్తున్నాయి. దానితో కొత్త కొత్త విధానాలను తెరపైకి తీసుకొచ్చి మాతో పోటీకి రాలేరు అన్నట్టుగా తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గట్టి ప్రచారాలను సైతం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి విద్యఅందుబాటులోకి రావడంతో ఇపుడు చాలా పాఠశాలల్లో అడ్మిషన్లకు ప్రైవేటు పాఠశాలలు మాదిరిగా ముందుగానే సీటు రిజర్వు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని పాఠశాలల్లో నేటికీ తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉండటంతో వారు ఆంగ్లబోధన చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాధమిక స్థాయిలోనూ ఇంగ్లీషును అమలుచేస్తే ఇక ప్రైవేటు పాఠశాలలు మూత దిశగా పయనిస్తా యని విద్యార్ధుల తల్లిదండ్రులే ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. అందులోనూ సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఎక్కడ ఏం జరుగుతుందో విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా ఇట్టే తెలిసిపోతున్నది. వాటికి అనుగుణంగా ఏ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఆంగ్లమాద్యమ విద్య అందుబాటులోకి వస్తుందో అక్కడికే తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవనే బోర్డులు దర్శనమివ్వడం కార్పోరేట్ పాఠశాలలకు మింగుడు పడకుండా ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఆంగ్లమాద్యమ విద్య ప్రాధమిక స్థాయి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తే మరో ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలు మరో 50శాతం కనుమరుగు కావడం ఖాయం.