ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక..ప్రజలకు తక్కువ సమయంలో అత్యధిక సేవల ద్వారా చేరువైన ఏకైక ప్రభుత్వశాఖ గ్రామ, వార్డు సచివాలయశాఖ. భారతదేశంలోనే ఏపీలో ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు ఎలాంటి సమస్యలూ ఉండవనుకున్నారు దీనిని ఏర్పాటుచేసినపుడు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా. అయితే వీరి సమస్యలు తప్పా..అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారుల సమస్యలు ఈ ప్రభుత్వంలో తీరుతున్నాయి తప్పితే ఈశాఖ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా తీరడం లేదు. కానీ ఈశాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం మీడియా ప్రచారాలతో మేమున్నాం మీకోసం, సమస్యలన్నీ తీర్చేస్తాం, 50 సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి పరిష్కరించామంటూ తెగ ఊదరగొడుతున్నారు. వాస్తవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఈ ఒక్కశాఖతో సుమారు 19 ప్రభుత్వశాఖలు ముడిపడి ఉండటంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య వారికే సరైన సమన్వయం లేక ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వశాఖల్లోని అతిపెద్ద రెండవ శాఖ ఉద్యోగులుగా ఉన్నవీరికి అసలు వీరి ఉద్యోగం ఏమిటి..? వీరికి ఏ సర్వీసు రూల్సు అమలు/వర్తింపజేచేస్తారు..? వీరి ఉద్యోగం నాల్గవ తరగతా..? ఐదవ తరగతా..? 6వ తరగతా..? అసలు వీరిది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమేనా..? అదే అయితే వీరికి ఎందుకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ప్రయోజనాలు, గుర్తింపు లేకుండా పోయింది అనేది ఈశాఖ ఉద్యోగ సంఘాల నాయకులకే సరైన క్లారిటీ లేదనేది తేటతెల్లం అవుతుందంటున్నారు విశ్లేషకులు. వాటికి కారణాలను క్రమ సంఖ్యవారీగా ఒక్కసారి పరిశీలిస్తే..!
1)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ శాఖకు నేటివరకూ చట్టబద్దత తీసుకురాలేదు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసినా దానిని అసెంబ్లీలో ఆమోదింప చేయలేదు. 2)ఇదే శాఖలో ఉన్న కొన్నిశాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. 3)వీరికి ఏ కేటగిరీ ఉద్యోగాల క్రింద సర్వీసు రూల్సు వర్తింపచేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఏపీ సబార్డినేట్ సర్వీసురూల్స్ ని సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తామని ప్రకటించినా ఈ శాఖలోని ఉద్యోగులు గ్రేడ్-6, గ్రేడ్-5 కేటగిరీ ఉద్యోగాలున్నాయి..4)చట్టబద్దత లేని ప్రభుత్వశాఖ క్రిందిస్థాయి ఉద్యోగులకు ఏ విధంగా పిఆర్సీ అమలు చేస్తారో నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. గతంలో పీఆర్సీ ఇచ్చినట్టు చెప్పిన ప్రభుత్వం వీరికి ఐఆర్ వర్తింపచేయలేదు. ఇపుడూ అదే పరిస్థి ఉంటుందా..అనేది అనుమానమే. 5) సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికి అదనంగా 9నెలలు తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేశారు. ఆ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను వీరి పేస్కేలుకి కలపలేదు..అపుడే వీరు అదనపు కాలానికి పేస్కేలు కోల్పోయారు, అదే సమయంలో డిఏలను కూడా కోల్పోయారు. 6)ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా వీరికి డిఏ వర్తిస్తుందా..లేదా అనేది ఇంకా డైలమాలోనే ఉన్నది. డిఏ వర్తిస్తే ఎప్పటి నుంచి లెక్కగట్టి ఇస్తారు..? ఇప్పటికే ఆలస్యంగా సర్వీసులు రెగ్యులర్ చేయడం వలన ఒకటిన్న డిఏ ఉద్యోగులు కోల్పోయారు. ఆ తరువాత నుంచి వీరి సర్వీసును ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా డిఏ వర్తిపంచేస్తారు..? లేదా అనేది అనుమానమే..7)మిగిలిన ప్రభుత్వశాఖల మాదిరిగా వీరికి ఏ తరహా డిపార్ట్ మెంటల్ టెస్టులు వర్తిస్తాయి.. ఉద్యోగులు ఏఏ పరీక్షలు రాయాలనే దానిపైనా స్పష్టత లేదు. అలా లేకపోతే వీరికి పదోన్నతులు రావు..ఎన్నేళ్లైనా పంచాయతీ కార్యదర్శిలు మాదిరిగా ఉద్యోగులందరూ ఇదే సచివాలయాలకు పరిమితం అయి ఉండిపోతారు. 8)ఉద్యోగుల డిఏలు, పీఆర్సీలు, పెరిగిన పేస్కేలు అమలు సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలా..? ఇస్తే వీరికి డిఏలను కలపి రాయాలా..లేదంటే కలపకుండా రాయాలా అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.. 9)ప్రభుత్వం ఈశాఖ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డిఏలు వర్తిస్తాయని ఇచ్చిన జీఓల్లో ఎక్కడా గ్రామ,వార్డు సచివాలయశాఖ నుపేర్కొనలేదు. వీరికి అసలు డిఏలు వస్తాయా..రావా..? 10) అన్ని ప్రభుత్వశాఖలకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినట్టుగా గ్రామ, వార్డు సచివాలయశాఖ యూనియన్ కు ప్రభుత్వ గుర్తింపు ఉందా..అలా ఉంటే జాల్లా యూనిట్ ఆఫీస్ బ్యారర్ లకు ఇతర ఉద్యోగ సంఘాల మాదిరిగా ప్రయోజనాలు సమకూరుతాయా లేదా అనేది కూడా తేలలేదు. ఇలాంటి సమస్యలు ఈశాఖ ఉద్యోగులకు చాలానే ఉన్నాయి. వాటిపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావన తేకుండా ప్రతీసారి ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్పితే వీరి సమస్యల పరిష్కారానికి మార్గం చూపించడం లేదు.
ఇప్పటికీ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు తమ ఉద్యోగాలు అసలు రెగ్యులర్ ఉద్యోగాలేనా..? అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రభుత్వం కాకుండా మరేదైనా ప్రభుత్వం వస్త ఈ ఉద్యోగాలన్నీ తీసేస్తారని..లేదంటే వేరే శాఖలు పంపేస్తారనే ప్రచారం కూడా రాష్ట్రంలో చాలా గట్టిగా జరుగుతుంది. కారణం వీరికి ప్రభుత్వ ఉద్యోగంలోని కేటగిరీలు తెలియకపోవడం, ఏ కేట గిరీకి ఏ సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్, ఇన్ సర్వీసు విధానాలు అమలు అవుతాయో తెలియకపోవడం, వాటి కోసం ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియకపోవడమే. ఈ విషయంలో ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఉద్యోగులను చైతన్యం చేస్తూ వస్తున్నది. ఈ శాఖకు సంబంధించిన ఏ ప్రభత్వ ఉత్తర్వు సారాంశం అయినా క్షణాల్లో ఉద్యోగుల ముందుకి తీసుకు వస్తున్నది. ఒక్కఈ ప్రభుత్వశాఖ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత వేగంగా ఉద్యోగులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులు వారధులు లాంటి వారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు రాకపోయినా, వాటిని ప్రభుత్వం అమలు చేయకపోయినా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తారు. అలాంటి ఉద్యమాలు జరగకుండా ఉండాలన్నా, ఉద్యోగుల సేవలు నిరంతరం
ప్రజలకు చేరాలన్నా ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాల్సిన, కల్పించాల్సిన ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించాలి. లేదంటే ఉద్యోగులంతా వన్ సైడ్ అయిపోతే ప్రభుత్వంలో భారీ మార్పులు రావడం కష్టం. ఆ విషయం గత ఎన్నికలో రుజువైందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. చూడాలి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నాయకు ఎంతమేర పరిష్కరిస్తారనేది..!