అక్రిడిటేషన్లకు మరోసారి ఆన్ లైన్ దరఖాస్తు..


Ens Balu
2
Amaravati
2020-09-28 20:14:05

రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ముగుస్తున్నందున కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.ipr.ap.gov.in ను అందుబాటులో ఉంచామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి  తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు అదే లాగిన్ ఐడి ఉపయోగించి, తమ దరఖాస్తులకు అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో తమ దరఖాస్తుతో పాటు సమర్పించే డాక్యుమెంట్స్ సర్టిఫికెట్‌లో అప్‌లోడ్ చేయవలసినదిగా కోరడమైనది. గత దరఖాస్తులలో అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు పిడిఎఫ్ ఫార్మెట్లో అప్ లోడ్ చేయనందున, వారు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో కనబడలేదు కావున, అభ్యర్థులు విధిగా వారు సమర్పించాల్సిన పత్రాలు 'పిడిఎఫ్ ఫార్మెట్'లో మాత్రమే అప్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అలాగే, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రస్తుతం మీడియా సంస్థ మారి ఉంటే, అటువంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సంబంధిత యాజమాన్యం వారి సంస్థలలో పనిచేయుచున్న పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడానికి రికమండేషన్ లేఖలను మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి సవరించిన లేఖలను అప్ లోడ్ చేయాలన్నారు అలాగే తాజాగా రికమెండేషన్ లేఖలను రాష్ట్రస్థాయిలో కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మరియు జిల్లాస్థాయిలో సంబంధిత సమాచార పొర సంబంధాల శాఖ కార్యాలయాలలో సమర్పించాలన్నారు. కావున, ఇదివరలో అక్రిడిటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు వారి డేటాను మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు వెబ్ సైట్ ను 04-10-2020 వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకుని, పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా అప్ లోడ్ చేయనివారు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను అప్ లోడ్ చేసి నకలు కాపీలను సంబంధిత కార్యాలయములలో అందజేయాల్సిందిగా కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి కోరారు.