కూటమి ప్రభుత్వంలో అధికారులు పెట్టే అధిక పనిభారం వేధింపులతో స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ(సచివాలయ) ఉద్యోగుల గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు.. గత ఏడాది ఒక్క డిసెంబరులోనే 15 మంది మృతిచెందితే.. 2026 జనవరిలో విశాఖ జివిఎంసీ పరిధిలోని ఆరిలోవ శివాజీ నగర్ -2 సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సందక ఉదయ్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.. బిఎల్వో విధులు చేస్తూనే.. ఉన్నచోటే కుప్పకూలిపోయాడు..వెంటనే సహచర ఉద్యోగులు ఆరిలోవ హెల్త్ సిటీకి తరలించినా ఫలితం లేకపోయింది.. అప్పటికే ఉదయ్ మృతిచెందారని వైద్యలు నిర్ధారించారు.. దీనితో జీవిఎంసీలోని అన్ని స్వర్ణ వార్డుల్లో విషాదం నెలకొంది. విశాఖ జివిఎంసీ పరిధిలో సచివాలయ ఉద్యోగుల్లో రెండు నెలల్లో ఇది రెండవ గుండెపోటు మరణ కావడం విశేషం..రాష్ట్రంలో ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ఒక్క స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ(సచివాలయ) ఉద్యోగులు గుండెపోటుకి బలికావడం ఇతర ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నది..!
కూటమి ప్రభుత్వంలోని ఐఏఎస్ అధికారులు సచివాలయ ఉద్యోగులపై అధిక పనిభారం మోపి.. తద్వారా జరిగే గుండెపోటు మరణాలతో స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ(సచివాలయ) ఉద్యోగుల ద్వారా జనాభా నియింత్రణకు పూనుకున్నట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలోని ఒక్క విశాఖపట్నం జిల్లాలోని జీవిఎంసీ పరిధిలో రెండు నెలల్లో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు విధినిర్వహణలోనే గుండెపోటుతో మృత్యువాత పడ్డారంటే ఇక్కడి అధికారుల పని ఒత్తిడి వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ హేండ్ బుక్ నిబంధనలకు విరుద్దంగా సచివాలయాల్లోని ఉద్యోగులకు అదనపు పని భారంగా బిఎల్వో విధులు అప్పగించడంతో పాటు.. చెప్పిన సమయానికి ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయకపోతే సంక్రాంతికి సెలవులు ఇచ్చేది లేదని హుకుం జారీ చేయడంతో ఉద్యోగులు గత 15 రోజులుగా ఇళ్లకి ఏ సమయానికి వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వారం వారం రివ్యూలు.. ప్రతీరోజూ టెలీ కాన్ఫరెన్సులు.. పెట్టి ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడంతోపాటు..అధికారులు దారుణంగా వేస్తున్నారు.
అంతేకాదు.. జీవిఎంసీ పరిధిలోని అన్ని జోన్ లలో పనిచేస్తున్న స్వర్ణవార్డు ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయకపోతే జోన్ కమిషనర్లు జోన్ కార్యాలయాలకు పిలిచి మరీ పనులు చేయిస్తున్నారు. ఓటరు లిస్టులకి సంబంధించి ఓటర్లు ఉన్నా లేకపోయినా అధికారులకు అనవసరం.. వాళ్లకిచ్చిన టార్గెట్లు మాత్రం పూర్తవాల్సిందేనని ఉద్యోగులను వేధిస్తున్నారు. దీనితో పని ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ఇలానే ఆరిలోవ శివాజీ నగర్ -2 సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సందక ఉదయ్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.. ఈరోజు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఉదయ్ గుండెపోటుతో మృతిచెందడంతో ఇతర ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు కూడా చేశారు. రాజకీయనాయకుల సోషల్ మీడియా ప్రచారాలపై పోలీసులు కేసులు పెట్టే ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులను వేదించి, నిబంధనలకు విరుద్దంగా పనిభారం మోపి ఉద్యోగులు గుండెపోటు మరణాలకు గురైతే మాత్రం రాష్ట్రప్రభుత్వం అందకు సంబంధించి ఏ ఒక్క అధికారిపై చర్య తీసుకోవడం లేదు.
ఆరున్నరేళ్లుగా ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోని సచివాలయ ఉద్యోగులు.. రోజు రోజుకీ పనిభారం మోస్తున్నారు. తమకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి అర్జీపెట్టినా పట్టించుకోకపోవడంతో.. ఉద్యోగులు తమ అర్జీలను పట్టించుకోవాలని.. పరిగణలోనికి తీసుకోవాలని హైకోర్టుని సైతం ఆశ్రయించారంటే ఉద్యోగులను ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రక్కన పెట్టిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగని ప్రభుత్వానికి కావాల్సిన ప్రత్యేక పనులు, విధుల కోసం మాత్రం రాత్రికి రాత్రే జీఓలు విడుదల చేస్తున్నదని.. తమకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సర్వీసు రూల్స్ అమలు చేయాలని మాట్లాడితే మాత్రం అధ్యయనం చేయాలని దానికి చాలా సమయం పడుతుందని ప్రభుత్వం దాటవేత దోరణి అవలంభిస్తున్నది సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సచివాలయవ్యవస్థపై అనేక కధనాలు వండి వడ్డించిన పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు ఒక్కసారి వారికేమీ తెలియనట్టుగా మౌనవ్రతం పాటిస్తున్నాయి.
ఒకటి అరా ఈరోజు-ఈఎన్ఎస్ లాంటి పత్రికలు, మీడియా వాస్తవాలు చూపించినా.. గుండెపోటు మరణాల విషయం విశాఖ జీవిఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా దాటవేత దోరణి తప్పితే సచివాలయ ఉద్యోగులకు ఎక్కడా న్యాయం మాత్రం జరగలేదు. తమను ఇంతదారుణంగా వేధిస్తున్న ప్రభుత్వానికి తాము ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సచివాలయ ఉద్యోగులు బహిరంగంగానే వార్నింగులు ఇస్తున్నారు. అయినా విషయం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసినా కూడా పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ఏ ప్రభుత్వశాఖలోనైనా ఉద్యోగి మృతిచెందితే సదరు శాఖ అధికారులు ప్రకటిస్తారని.. కనీసం సచివాలయ ఉద్యోగులు ఆ ప్రకటనకు కూడా నోచుకోలేదని.. కారుణనియామకాలకు, ఇతర మరణాంతర ప్రయోజనాలకు కూడా నోచుకోకపోవడం విశేషం. సంక్రాంతి పండుగ వేళ జీవిఎంసీ అధికారుల విధినిర్వహణ ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందిన సచివాలయ ఉద్యోగి మరణంతోపాటు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ఏ విధమైన ప్రకటన చేస్తుందో వేచి చూడాలి..?!