గుండెపోటు మరణాలపై మౌనమేల.. ఒకేరోజు 4గురు సచివాలయ ఉద్యోగులు మృతి..!


Ens Balu
67
visakhapatnam
2026-02-16 18:42:18

ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల గుండెపోటు మరణాలపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.. రోజుకి ఒకరు మృత్యువాత పడుతున్న సంఖ్య సోమవారం ఒకేరోజు నాలుగు మరణాల నమోదుకి వేదికైంది.. అధికారుల పనిఒత్తిడి.. వేధింపులు.. అనధికార బిఎల్వో విధులు, టార్గెట్లు, బెదిరింపులే ఉద్యోగుల గుండెపోటు మరణాలకు కారణమని తెలిసినా ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు.. సర్వేల ఒత్తిడి కూడా సిబ్బందికి తగ్గించడం లేదు.. వెరసీ సచివాలయ ఉద్యోగంలోకి వచ్చిన పాపానికి కుటుంబ సభ్యులకు గుండెకోత మిలిచ్చి.. గుండె ఆగి మృత్యువాత పడుతున్నారు సచివాలయ సిబ్బంది.. చెట్టంత పిల్లలు కళ్లెదుటే గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నా.. కూటమి సర్కారు స్పందించకపోవడం పట్ల  కటుంబు సభ్యులు,  ఉద్యోగుల సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తం అవుతున్నాయి.


స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ (గ్రామ,వార్డు సచివాలయ)శాఖలో ఒకేరోజు నలుగురు ఉద్యోగులు మృత్యువాత పడటం..అందులోనూ ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఒక్కరోజులో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన డొంక విజయ్ కలవలపల్లి పంచాయతీలో పనిచేస్తూ.. గుండెపోటుతో మృతిచెందారు. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ తో తూర్పుగోదావరి జిల్లా బుచ్చయ్యపేటలోని సచివాలయ ఉద్యోగి లక్ష్మణరావు మృతిచెందారు. ఇక గుంటూరు జిల్లాలో ఏఎన్ఎంకి కె.సుజాతకి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించి సర్జరీ చేస్తున్న సమయంలో మృతిచెందారు. ఒంటిమిట్ట ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శిని లారీ ఢీకొనడంతో సురేష్ అనే ఉద్యోగి మృతిచెందారు. 

పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినాన నలుగురు సహచర ఉద్యోగులను కోల్పోయి న ఉద్యోగులకు వీరి మరణాలు కలవరపాటుకి గురిచేస్తున్నాయి. కళ్లముందే ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నా.. మండలాల్లోని ఎంపీడీఓలుగానీ.. పట్టణాల్లోని మున్సిపల్ జోనల్ కమిషనర్లు గానీ, జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్లు గానీ సచివాలయ ఉద్యోగుల మరణాలపై చిన్న ప్రకటన కూడా చేయకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే ప్రజలు మృతిచెందేవారు.. కానీ ఇపుడు సచివాలయంలో ఉద్యోగం వస్తే.. వాళ్లకి ఎప్పుడైనా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, సుగర్, బీపీతోపాటు ఎర్లీ డెత్ కూడా వీరిపై అదనపు విధులను బలవంతంగా రుద్దే అధికారుల ద్వారా వచ్చేస్తున్నది. దాని ప్రభావం సచివాలయ ఉద్యోగుల అందరిపైనా పడటంతో.. కొందరు పిట్టల్లా రాలిపోతుంటే.. మరికొందరు.. మానసిక వేధనను అనుభవిస్తున్నారు.

-వలసవెళ్లిపోతున్న సచివాలయ ఉద్యోగులు
సచివాలయశాఖలోని పనిచేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే కంటే.. ఇతర ప్రభుత్వశాఖల్లోనో.. సాఫ్ట్ వేర్ రంగంలో భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న ఉద్యోగులు డిఎస్సీ రాసి ఉపాధ్యాయులుగానూ, ఎపీపీఎస్సీ రాసి గ్రూప్-2, గ్రూప్-1 అధికారుల గానూ, మరికొందరు రియలెస్టేట్ రంగానికి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోయిన వారి సంఖ్య ఇటీవల వచ్చిన వివిధ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1000 మంది వరకూ సిబ్బంది ఖాళీ అయిపోయారు. రానున్న రోజుల్లో నోటిఫికేషన్లు పడితే మొత్తం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామపంచాయతీ ఉద్యోగులందరూ ఖాళీ అయిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఎందుకంటే ఈ శాఖలో పనిచేసి ప్రాణాలు పోగొట్టుకునే కంటే.. ఇతర ఉద్యోగాల్లో భవిష్యత్తు చూసుకోమని ఉద్యోగుల తల్లిదండ్రులు వారి పిల్లలకి సూచిస్తున్నారు. మరికొందరు లాంగ్ లీవ్ పెట్టి ఎపీపీఎస్సీకి సుదీర్ఘంగా పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించకుండా ఉద్యోగులపై అదనపు పనిభారాన్ని మోపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

సచివాలయ ఉద్యోగుల గుండెపోటు మరణాలను  రాష్ట్రప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి... ఈ ప్రభుత్వశాఖను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేయడం వలనే ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోగా.. మరణాలపై విచారణ కూడా చేయడలేదని.. జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదులు నమోదైనా కనీసం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఏపీఈపీడీసీఎల్ లోని ఎనర్సీ అసిస్టెంట్ల మరణాలు, మంచానికే పరిమితం అయిన వారి విషయంలో జాబితాల ఇవ్వాలని ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించినా.. నేటికి సమాచారం పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడానికిగల కారణం కూడా రాజకీయ కోణమే ఉందని సచివాలయ ఉద్యోగులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

-న్యాయపోరాటంతోనే మరణాలు ఆగుతాయి..ప్రయోజనాలొస్తాయి
గ్రామ, వార్డు సచివాలయ(స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ) శాఖలోని మరణ మృదంగం ఆగాలన్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309, రూల్ 28, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్టినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు రావాలన్నా ఒక్క న్యాయపోరాటమే దిక్కని సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు. దానికోసం భారీ ఎత్తున ఆందోళనకు సిద్దపడుతున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించడానికి సిద్దపడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఈశాఖపై వేసిన కేసులు పెండింగ్ లో ఉండగానే ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయం, విధినిర్వహణలో ఉద్యోగులు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

ఈవిషయంలో ఉద్యోగులకు ఎవరికి ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతుందని.. ఈ విధానంలో మార్పు రావాలన్నా.. ఉద్యోగుల ప్రాణాలు నిలబడాలన్నా.. సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా ఒక్క న్యాయపోరాటమనే దిక్కని.. న్యాయస్థానాలు మాత్రమే తమకి ఆఖరి మజిలీ అని ఉద్యోగులు ముక్త కంఠంతో బలమైన వాణి విపిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లోకి ఎంటర్ అయి.. ఉద్యోగుల కదలికలపై కన్నేసినా.. వాళ్లపని వాళ్లు చల్లగా చేసుకెళ్లిపోతున్నారు. ఏది ఏమైనా సచివాలయశాఖలో పెద్ద ఎత్తున సంభవిస్తున్న గుండెపోటు మరణాలపై ప్రభుత్వం ప్రకటన చేయపోవడంపై సచివాలయ ఉద్యోగుల కటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమనకి పట్టించుకోని ప్రభుత్వానికి తాము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే..?!