గ్రామ, వార్డు సచివాలయశాఖలో పదోన్నతుల రగడ..!


Ens Balu
777
Tadepalli
2023-10-31 03:03:20

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇపుడు పదోన్నతుల రగడ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.30లక్షల మంది ఉద్యోగులు 19శాఖల్లో పనిచేస్తున్నారు. 2 రెగ్యులర్ నోటిఫికేషన్ల ద్వారా నేరుగా ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వం, ఆ తరువాత కారుణ్య నియామకాల ద్వారానే మిగిలిన ఉద్యోగాలు భర్తీచేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో మూడేళ్లు దాటిన సచివాలయ ఉద్యోగుల్లో కొన్ని శాఖలకు పదోన్నతులు కల్పిస్తోంది. ప్రభుత్వం ఇటీవల, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హజ్బండరీ శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వారికి పేస్కేలు కూడా పెంచింది. ఏ ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు రాని విధంగా ఈ శాఖలోని ఉద్యోగులకు కేవలం ఐదేళ్ల లోపులోనే పదోన్నతులు రావడం ఒకరకంగా చెప్పుకోదగ్గ శుభపరిణామం. అయితే ప్రస్తుతం ఉన్న 19శాఖల్లోని ఉద్యోగుల్లో ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. అదే సమయంలో కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రం పదోన్నతులు కల్పించడం ఇపుడు ఇతరశాఖల ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఒకేసారి విధుల్లోకి చేరిన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలి. అలాకాకుండా కొన్నిశాఖల్లో ఉద్యోగులకు మాత్రమే పదోన్నతులు కల్పించడంపై ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆరోగ్యశాఖలోని ఏఎన్ఎంలకు కూడా ఇన్ సర్వీస్ ఇచ్చి జిఎన్ఎం(స్టాఫ్ నర్స్) శిక్షణలు ప్రభుత్వం పూర్తిచేస్తోంది. 

ఇప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన తరువాత రెండేళ్లకి సర్వీసు రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం అదనంగా 9నెలలు పనిచేయించుకున్న తరువాత ప్రత్యేకంగా టెస్టులు పెట్టి అవి పాసైన వారికి మాత్రమే సర్వీసు రెగ్యులర్ చేసింది. అక్కడ 9నెలలో పేస్కేలు, 2 డిఏలు కోల్పోయిన ఉద్యోగులు సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత రావాల్సిన 2 ఇంక్రి మెంట్లు కూడా కోల్పోయారు. పీఆర్సీ అమలు చేస్తున్నామంటూ చెప్పిన ప్రభుత్వం వీరికి పేస్కేలు రివైజ్ చేసి అమలు చేసినా..రావాల్సిన అరియర్స్ విషయంలో ఏలాంటి ప్రకటన చేయలేదు. దానితో అవి వస్తాయో రావో కూడా తెలియనని పరిస్థితి. అదీ కూడా సచివాలయ ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేసే సమయంలోనే హెచ్ఆర్ఏ, డిఏలను కుదించిన తరువాతన పిఆర్సీ అమలు చేసింది. ఇలా ఒక్కో సచివాలయ ఉద్యోగి సుమారు రూ.2 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది. అయినా కూడా సచివాలయ ఉద్యోగులందరికీ ఒకే విధానం అమలు చేయకుండా కొన్నిశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖల ఉద్యోగుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం పట్ల ఉద్యోగులల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే పలు ప్రయోజనాలు కోల్పోయిన ఉద్యోగులు ఇపుడు పదోన్నతులు కూడా  దూరం అవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరతీస్తున్నారు. పదోన్నతులు వచ్చిన వారి ఆర్డర్లు చూస్తూ, వారికి పెరిగిన జీత భత్యాలు చూసి ఒకింత ఆనంద పడుతూ, తాము ఇంకా దానికి నోచుకోలేదంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సర్వీసు రెగ్యులర్ అయ్యే సమయంలో మెటర్నటీ లీవ్ లు పెట్టిన వారికి ఆ సెలవుల సమయం పూర్తయిన తరువాత మాత్రమే ప్రభుత్వం నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేసింది. కానీ నిబంధనల ప్రకారం ఉద్యోగుల సర్వీసు మాత్రం రెండేళ్లకే రెగ్యులర్ చేయలేదు. ప్రభుత్వానికి ఆర్ధిక పరమైన అంశాల విషయంలో నింబంధనలు పాటిస్తున్న ప్రభుత్వం ఉద్యగులకు ప్రయోజనాలు చేకూర్చే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన, నిబంధనలు పాటించకపోవడం విశేషం.

కొత్త పోస్టుల భర్తీలేకుండా చేసేందుకే పదోన్నతులు తెరపైకి..
ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు కాకముందు వ్యవసాయశాఖలో ఏఈఓ, ఉద్యానవనశాఖ శాఖలో హెచ్ఈఓ, పశు సంవర్ధక శాఖలో సహాయకులు, ఫిషరీష్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యశాఖ లో స్టాఫ్ నర్సులు, విద్యుత్ శాఖలో లైన్ మేన్ లు, మండల సర్వేయర్లు, తదితర పోస్టులు ఉండేవి. సచివాలయశాఖ ఏర్పాటు చేసిన తరువాత రెండు మూడు శాఖలకు కలిపి ఒక పోస్టును ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇపుడు సదరు పోస్టులు నేరుగా భర్తీచేయాలంటే వారికి పేస్కేలు అదనంగా వుంటుంది. సచివాలయ శాఖలోని ఉద్యోగులకే పదోన్నతులు కల్పిస్తే సదరు పోస్టులను మళ్లీ భర్తీచేసే అవకాశం వుండదు. దీనితో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సచివాలయశాఖలో ఉన్న పలు శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తోంది. దీనితో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కొత్త పోస్టులు తీసే అవకాశం లేకుండా ఉద్యోగులకు మేలు చేస్తున్నట్టుగా పదోన్నతులు కల్పిస్తున్నది ప్రభుత్వం. అయితే ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ఒక్క సచివాలయశాఖలోనే ఐదేళ్ల లోపునే ఉద్యోగులకు పదోన్నతులు రావడం అనేది ఒక చరిత్రగానే చెప్పాలి. అదే సమయంలో చాలా ఉద్యోగాల భర్తీకి ఈ విధానం అడ్డుగా మారుతోంది. అలాగని అన్నిశాఖల ఉద్యోగులకు సమానంగా పదోన్నతులు కల్పిస్తుందా అదీ లేకుండాపోయింది. ప్రస్తుతం సచివాలయశాఖలోని ఇంజనీరంగ్ అసిస్టెంట్లు హౌసింగ్, ఆర్అండ్ బి, పంచాయతీరాజ్ తదితర ఇంజనీరింగ్ శాఖల పనులు చేస్తున్నారు. వెల్పేర్ అసిస్టెంట్లు, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖలు చూస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్లు కార్యాలయ పనులతోపాటు, ఆధార్, ఇతర సర్వీసులు పనులు చేస్తున్నారు. మహిళా పోలీసులు హోంశాఖ, ఐసిడిఎస్, ఎస్ఈబి, రెవెన్యూశాఖ(బిఎల్వో) విధులు చేస్తున్నారు.  ప్రభుత్వంలోని పలు శాఖల విధులు చాలా వరకూ సచివాలయ ఉద్యోగులతోనే జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలో అన్నిశాఖల ఉద్యోగులకు సమానంగా పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం కొన్నిశాఖల వారికే 
పదోన్నతులు కల్పిండం పట్ల ఉద్యోగులు లోలోన మదన పడిపోతూ, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు.

పదోన్నతులు వ్యవహారం ఎన్నికలపై ప్రభావం..
గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని కొన్నిశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలినశాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించని వైనం 2024 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం గట్గిగా వుంటుందంటున్నారు. అదే సమయంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, షిషరీష్, పశుసంవర్ధకశాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా కేవలం సచివాలయ ఉద్యోగులను తమతో సమానంగా పదోన్నతులు ఇవ్వడాన్ని మిగిలిన శాఖల ఉద్యోగులు తప్పు పడుతున్నారు. ప్రస్తుతం ఖాళీలు ఉన్నచోట కొత్త ఉద్యోగాలు భర్తీచేయకుండా ప్రభుత్వం ఏఈఓ, హెచ్ఈఓ, షిషరీష్ పీల్డు అసిస్టెంట్లను గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేసేస్తూ ఖాళీలు ఉన్న ప్రదేశాలకు ఉద్యోగులను బదిలీలు చేస్తున్నది. గతంలో రెవిన్యూ శాఖలో విఆర్ఏలుగా ఉన్నవారికి వీఆర్వోగా పదోన్నతి ఇచ్చి సచివాలయాలకు పంపేసింది. దానితో ఇప్పటి వరకూ కార్యాలయాలకే పరిమితం అయిన ఉద్యోగులు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు బదిలీ కావాల్సి వస్తున్నది. అలాగని వారికి రావాల్సిన పదోన్నతులు మాత్రం రావడం లేదు. మరోవైపు గ్రామసచివాలయ మహిళా పోలీసుల పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. హైకోర్టుకి సమర్పించిన అఫడవిట్ తో వీరు పోలీసుశాఖ సిబ్బందిగానే ఉన్నా, వీరి విధులు మాత్రం బిఎల్వో, ఐసిడిఎస్, ఇతర సచివాలయ ఉద్యోగుల పనులే ఉన్నాయి. పలు కోర్టు కేసులు కూడా ఉన్నందున మహిళా పోలీసులకు సీనియర్ మహిళా పోలీసుల పదోన్నతులు వచ్చే అవకాశాలు కనింపించడం లేదు. మరికొన్ని శాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానలే ఏర్పాటు కానుందున వారికి పదోన్నతులు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల తోపాటు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేసే చర్యలకు తగ్గట్టుగా పనిచేయాల్సి వస్తున్నది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో రాజుకున్న పదోన్నతుల రడగ ఏ స్థాయికి చేరుతుంది..ప్రభుత్వం మిగిలిన శాఖల సిబ్బందికి ఎలాంటి న్యాయం చేస్తుందనేది వేచి చూడాలి..!