ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అపుడే కూటమి ప్రభుత్వంలోని పరిపాలనపై పెదవి విరుపులు మొదలు పెట్టారు.. పరిపాలనా ధక్షుడు ముఖ్యమంత్రిగా వస్తే పాలన బాగుంటుందనుకుంటే.. మళ్లీ అదే పాత ప్రభుత్వ విధానాలు.. రెండవ శనివారాలు, ఆదివారాల్లోనే ఉద్యోగులకు ప్రత్యేక విధులు, జూమ్ మీటింగులు.. బిఎల్వో విధులకి సొంత ఖర్చులతోనే వైట్ పేపర్లు కొనుక్కోమని చెప్పడం.. ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ శాఖల యాప్ ల నిర్వహణ.. ఇంటర్నెట్ కి, స్టేషనరీకి చేతి చమురు వదిలిపోవడం.. వారంతంలో కనీసం బట్టలు ఉతుక్కోవడానికి.. నెరిసిన గెడ్డం గీక్కోడానికి.. పిల్లలతో ఓ పూట గడపడానికి కూడా లేదా..? నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇది కానే కాదు.. కానీ నాటి ప్రభుత్వంలోని రాష్ట్ర అధికారులే ఈ ప్రభుత్వంలోనూ ఉన్నారు కదా.. ఇంకా గత ప్రభుత్వ పరిపాలన నుంచి రాష్ట్ర అధికారులు బయటకు రాలేకపోతున్నారు.. ప్రభుత్వం కూటమిదే అయినా.. ఇంకా గత ప్రభుత్వ విధానాలనే రాష్ట్ర, జిల్లా అధికారులు అవలంభిస్తూ చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు పెదవి విరిచేలా చేస్తున్నారు.. ఇదేదో కావాలని బుదర జల్లుతున్న మాటలు కాదు.. ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చల సారాంశం మాత్రమే ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనం రూపంలో మీ ముందుకి తీసుకు వస్తున్నది..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాల్గవ తరగతి ఉద్యోగులకి జీతంలో సుమారు నెలకి 2 వేల నుంచి మూడు వేల రూపాయల వరకూ ప్రభుత్వ విధుల కోసమే ఖర్చు చేయాల్సి వస్తున్నది. అవును మీరు చదువుతున్నది నిజం. ప్రభుత్వం ఉద్యోగులకి అప్పగిస్తున్న అదనపు విధులకు ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వంలోనూ అవలంభిస్తున్నది. రెవిన్యూ, పోలీసు, సచివాలయ ఉద్యోగులకు అదనంగా అప్పగిస్తున్న బిఎల్వో, ఇంటింటా సర్వే, ప్రభుత్వ యాప్ ల నిర్వహణ, కార్యాలయాల్లోని స్టేషనరీకి సైతం ఉద్యోగులే వారి జీతంలో నుంచి ఖర్చులు చేయాల్సి వస్తుంది.
ఇంత చేస్తున్నా.. కనీసం ఆదివారాలు, పండుగ సమయాలు, రెండవ శనివారాల్లోకూ ఉద్యోగులను ఖాళీ ఉంచకుండా ప్రత్యేక విధులు అప్పగిస్తుండటంతో ఉద్యోగులు రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పడం లేదని నెత్తీ నోరూ కొట్టుకుంటూ ప్రభుత్వ పరిపాలనపై తమ నిరసనను సామాజిక మాద్యమాల వేదిక ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ.. ఆవేదన చెందుతున్నారు. అచ్చుగుద్దినట్టు గత ప్రభుత్వ విధానాలే కూటమి ప్రభుత్వంలో కూడా రాష్ట్ర, జిల్లా అధికారులు అమలు చేసి.. వారాంతంలో ఒక్కపూట కూడా ఇచ్చిన సెలవు సద్వినియోగం చేసుకోకుండా ప్రత్యేక విధులు అప్పగించడం పట్ల కూటమి ప్రభుత్వంపైనా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అంటే ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలకు పూర్తి సేవలు అందించడం ఒక్కటే ఉంటుందనుకున్నాం.. కానీ గత ప్రభుత్వంలోని అధికారులే ఇప్పడుకూడా ఉండటంతో ఆ పాత పరిపాలనే చేపట్టి సీఎం విజన్ కి వ్యతిరేకంగా చేస్తున్నారంటూ ఉద్యోగులు మండి పడుతున్నారు. గత ప్రభుత్వంలోని నాలుగేళ్లుగా చెల్లించని బిఎల్వో విధుల గౌరవ వేతనం కోసం కూటమి ప్రభుత్వంలో కూడా అధికారలు మాట్లాడకపోగా.. ఇపుడు మళ్లీ కొత్తగా విధులు అప్పగించి.. దానికి సరిపడా స్టేషనరీ, సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ కూడా ఉద్యోగులే భరించి.. సెలవుదినాలు, రెండివ శనివారాలు, ఆదివారాల్లో పనులు చేయాలని పురమాయించడంతో ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండి ప్రభుత్వ విధులు చేయాల్సి వస్తున్నది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వస్తున్నదే తక్కువ జీతం అందులోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా అప్పగిస్తున్న విధులతో అందులో నుంచే స్టేషనరీ, మొబైల్ ఇంటర్నెట్ లకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. జిల్లా అధికారుల నుంచి ఇష్టం వచ్చిన తిట్లు తినకుండా ఉండేదుకు సొంత డబ్బులు ఖర్చుచేస్తున్నా.. కనీసం దానిని కూడా గుర్తించి ప్రభుత్వమే ఇవ్వాల్సిన అదనపు పనికి గౌరవ వేతనం ఇవ్వకపోగా.. కనీసం వారాంతంలో ప్రశాంతంగా కుటుంబాలతో గపడనీయకుండా చేస్తున్నారని ఉద్యోగులు వారిలో వారే చెప్పుకొచి మదన పడుతున్నారు. ఇంతచేస్తున్నా ప్రభుత్వం సర్వీసు ఆధారంగా ఇవ్వాల్సిన పదోన్నతులు కూడా ఇవ్వడం లేదని.. అసలు ఆ దస్త్రాలను ఆయా శాఖల కమిషనర్లు ముందుకి కదపడం లేదని మండిపడిపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల వ్యతిరేకత ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడే ప్రభావం ఉంటుందని కూడా సమాచారం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులను గత ప్రభుత్వంలో ఇష్టానుసారం వాడేస్తే.. ఓటుతోనే కుటుంబం మొత్తం సమాధానం చెప్పామని.. ఇపుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధానాలు అమలు చేస్తే మళ్లీ అదే ఓటు అస్త్రాన్ని వినియోగిం చాల్సి వస్తుందనే చర్చకు తెరలేపడం ఇపుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది. అంతేకాకుండా ప్రభుత్వ పరిపాలనకు సంబం ధించి త్వరగా జరగాల్సిన పనులను కూడా ప్రభుత్వం అదనంగా ఖర్చుతో కూడిన పనులను అప్పగిస్తున్నందునే అదే సాకు చూపి.. జాగు చేయాలని కూడా అధికారులు, సిబ్బంది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.
అందునా మహిళా ఉద్యోగులైతే ప్రభుత్వానికి బయటకు చెప్పుకోలేని సమస్యలను, ఇబ్బందులను వారాంతంలో ఇచ్చే సెలవులను ప్రశాంతం గా పనులు చేసుకోవడానికి కూడా లేదని.. వారమంతా వేసుకున్న మాసిన బట్టలే.. ఉతుక్కోవడానికి కూడా కాళీ లేకపోవడంతో మళ్లీ విధులకు పాత బట్టలమీదే సెంటు కొట్టుకొని వెళ్లాలా చేస్తున్నారంటూ మండిపడిపోతున్నారు. వారానికి ఒకసారి వచ్చే సెలవుల్లో కుటుంబం లోని శుభకార్యాలు, ఇంటిపనులు చూసుకోవడానికి కూడా వీలులేకుండా వారాంతంలో అప్పగించే పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులతో మొదలైన వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజలకు పాకుతుందడనంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి ఈ అదనపు విధులకి ప్రభుత్వం చర్యలు ఏవిధంగా ఉంటాయనేది..?!