ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు భారీ సంఖ్యలో రిటైర్ కాబోతున్నారు.. గత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల రిటైర్ మెంట్ గడువు పూర్తవడంతో ఉద్యోగులు వేల సంఖ్యలో ఖాళీ అయిపోతున్నారు.. ఉన్నఫలంగా కొత్త ఉద్యోగాలను భర్తీచేయాలంటే ప్రభుత్వానికి తలకి మించిన ఆర్ధిక భారం.. ఆ ఇబ్బందులను అదిగ మించాలంటే ఇపుడు గ్రామ, వార్డు సచివాలయ శాఖ మాత్రమే కూటమి ప్రభుత్వానికి శరణ్యంగా కనిపిస్తున్నది.. ఖాళీ అయిపోతున్న శాఖల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 1.25 లక్షల మంది సచివాలయ ఉద్యోగులనే ఆయా ప్రభుత్వశాఖల్లోకి సర్ధుబాటు చేయాలి.. లేదంటే కొత్తనోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీచేయాలి.. ఆ పని ఇప్పట్లో దగ్గరలో లేకపోవడంతో.. సచివాలయ వ్యవస్తలో మార్పులు చేసి ఉద్యోగులను విభజించనున్నారు.. ప్రస్తుతం ఉన్న సచివాలయాల్లో ఎంతమందిని ఉంచితే బాగుంటుంది.. మరెంత మందిని ఇతర శాఖల్లో విలీనం చేస్తే కొత్త ఉద్యోగుల భారంత తగ్గుతుందనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇపుడు ఖచ్చితంగా మార్పులు, చేర్పులు చేయాల్సిన సమయం ఆశన్నమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుందని భావించి సచివాలయశాఖ ను ఏర్పాటు చేసి.. ఇందులో పనిచేసే ఉద్యోగులకు తలా తోకా లేకుండా చేసింది. ఐదేళ్లు దాటిపోతన్నా ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదంటే గత ప్రభుత్వం ఏవిధమైన తేడా ఆలోచన చేసిందో అర్ధం చేసుకోవచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా.. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని తేడా విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగులను భర్తీ చేసింది.
ఒక ప్రభుత్వశాఖ ఉద్యోగితో పది ప్రభుత్వశాఖల విధులు నిర్వహించేలా చేయడానికి ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఎలాంటి పదోన్నతులు కల్పించే వీలు లేకుండా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా చేతులు దులిపేసుకుంది. దీనితో పదిశాఖల విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. పైగా శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు, పనిగంటలు అయిపోయిన తరువాత కూడా ప్రభుత్వం కోసం పనిచేయాల్సి వస్తున్నది. వేళా పాలా లేకుండా కావాల్సినట్టుగా పనిచేస్తున్నా.. ఉద్యోగుల సమస్యలు మాత్రం గత ప్రభుత్వంతోపాటు.. ఈ ప్రభుత్వం కూడా పరిష్కరించడమే మానేసింది.
అలాంటిది ఇపుడు ఇతర ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగవిరమణలుచేయడంతో ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయశాఖ మాత్రమే శరణ్యం అవుతోంది. దీనితో ఇపుడు సచివాలయశాఖలోని కొన్ని విభాగాల ఉద్యోగులను మాత్రుశాఖలకు బదిలీ చేసి.. కొద్ది మందితోనే సచివాలయాలను నడిపించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే ఇపుడు అలా చేయడానికి సచివాలయశాఖలోని ఉద్యోగుల సర్వీసునిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఇదే కూటమి ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారింది. ఉన్న ఉద్యోగులను మాత్రుశాఖల్లోకి విలీనం చేయాల్సి వస్తే సాధారణ పరిపాలన శాఖ నుంచి సచివాలయ శాఖ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు అమలు చేయాలని.. లేని వారికి మాతృశాఖలోని నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేక జీఓ ఇవ్వాల్సి వుంటుంది.
అలా చేయకపోతే ఉద్యోగులను ప్రభుత్వశాఖల్లోకి విలీనం చేసినా.. సదరు ప్రభుత్వశాఖలోని ఉద్యోగుల ప్రయోజనాలు, ఇతన నిబంధనలు సచివాలయ ఉద్యోగులకు అమలు కావు. తరువాత నష్టాన్ని కూడా సచివాలయ ఉద్యోగులే భరించాల్సి వుంటుంది. అలాగని ముందుగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసునిబంధనల కోసం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే ఆ ఏర్పాటు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇపుడు ఖాళీ అయిపోతున్న ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులను సర్దుబాటు చేయడానికి మాత్రమే ప్రభుత్వం చూస్తున్నది.
రాష్ట్రప్రభుత్వం సచివాలయశాఖలోని కొన్ని విభాగాల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోతే.. జీవితాంత ఉద్యోగలకు పదోన్నతులు రావు. అలాగే మాతృశాఖలోని ప్రయోజనాలు కూడా వీరికి వర్తించవు. ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉద్యోగులను విలీనం చేయడం ద్వారా ప్రభుత్వానికి కొత్త ఉద్యోగాల భర్తీచేసే భారం అయితే తప్పుతుంది కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి మేలూ జరగదు. ప్రభుత్వం ఉద్యోగులను ప్రభుత్వశాఖల్లోకి విలీనం చేసి.. ఏశాఖలో అయితే సచివాలయ ఉద్యోగులను విలీనం చేస్తుందో సదరు శాఖలోని సర్వీసు నిబంధనలు వీరికి అమలు చేయాలి. ఇపుడు ప్రభుత్వం ఆవిధంగా చేస్తుందా..లేదా అనేది మాత్రం తెలియడం లేదు. కానీ ఉద్యోగులను విభజించి నలుగురు లేదా ఐదుగురు ఉద్యోగులతోనే సచివాలయాలు నడిపించడానికి మాత్రం ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. గత వైఎస్సార్సీపీ తేడా విధానాల వలన సచివాలయ ఉద్యోగులు చాలా ప్రయోజనాలు కోల్పోయారు.
ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అదే తప్పుని చేస్తూ ఉద్యోగుల పొట్టగొడుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చి హామీల విషయంలో కూటమి ప్రభుత్వం నేటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాదు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన మహిళాపోలీసుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను ఖాళీ అవుతున్న ప్రభుత్వశాఖల్లో విలీనం చేసే సమయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుందనే విషయంలో మిలియన్ డాలర్ల ప్రశ్నలకు జావాబులు లేవు. చూడాలి కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ తరహా సర్వీసు నిబంధనలు అమలు చేస్తుంది. వీరికి ఏ విధమైన పదోన్నతులు కల్పిస్తుంది.. సమయపాలన అమలు చేస్తుందా..? అనేది వేచి చూడాలి..?!