అలాంటివారిపై ఉక్కుపాదం మోపండి..


Ens Balu
3
Velagapudi
2020-10-21 19:52:02

ఆంధ్రప్రదేశ్ లో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే అసాంఘిక శక్తుల మీద, లంచగొండితనం, అవినీతి, రౌడీయిజమ్, నేర ప్రవర్తన మీద నిజాయితీగా, నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపాలని సీఎం  వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి స్పష్టం చేశారు. దిశ బిల్లు తీసుకు రావడం దగ్గరి నుంచి, రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడం, వాటిలో ఎక్కువగా మహిళలనే నియమించడం, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ బిల్లుకు కేంద్రం కూడా ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘దేశంలోనే మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం ఏపీ అన్న సీఎం ఆ దిశలో సంకేతాలు ఇచ్చి, గట్టి చర్యలు తీసుకునేందుకు, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హోం మంత్రిని, నా సోదరి సుచరితమ్మను హోం మంత్రిగా కూడా చేయడం జరిగింది’ అని  సీఎం తెలిపారు. హోమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎ ప్పుడూ అండగా ఉంటుందని పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామని ఆమె గుర్తు చేసారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ సేవా యాప్ కూడా తీసుకొచ్చామని హోం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ విధి నిర్వాహణలో అనేకమంది పోలీసులు వీరమరణం పొంది పోలీసులందరికీ వారు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈఏడాది దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు విధినిర్వాహణలో అమరులయ్యారని వారికి పోలీస్ శాఖ తరపున నివాళులు అర్పిస్తున్నామన్నారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారన్నారు.  6వ బెటాలియన్ కమాండెంట్ పి.వి. హనుమంతప్ప పేరేడ్‌కు సారథ్యం వహించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి  వెంకటేశ్వరరావు (నాని), మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, శాసనసభ్యులు జోగి రమేష్, యం. జగన్మోహనరావు, దూలం నాగేశ్వరరావు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పోలీస్ ఉన్నతాధికారులు ద్వారకాతిరుమలరావు, అనురాధ, సంజయ్, ఆర్అండ్‌బి ప్రిన్సిపల్ సెక్రటరి యంటి. కృష్ణబాబు, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, నగరసిపి బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.