ఎస్వీబీసీపై బూతు ప్రయోగం కావాలనే చేశారా..
Ens Balu
2
తిరుమల
2020-11-11 15:37:54
శ్రీవారిని ఎంతో భక్తితో భక్తులకు చూపించే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ పై బురదచల్లేందుకు స్వయాన ఉద్యోగులే ఉపక్రమించడం సంచలనం రేపుతోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. పరమ భక్తితో శ్రీవారి ప్రసారాలు చేయాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డిలు విచారణకు ఆదేశించారు. దీంతో డొంక మొత్తం కదిలింది. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపించాడు. దీంతో ఆ లింక్ సైట్ చూసిన భక్తుడు ఈ విషయాన్ని తక్షణమే టీటీడీ చైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్‌క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో టిటిడి అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు కనిపించాయి. నేరుగా ఉద్యోగులే పోర్న్‌సైట్ వీడియో చూస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. అదేసమయంలో భక్తుడికి పోర్న్ లింక్ పంపిన అధికారితోపాటు.. అశ్లీల సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులతో పాటు, విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25మంది సిబ్బందిని గుర్తించారు. విధినిర్వహణలో స్వామివారికి చెందిన కార్యక్రమాలు కాకుండా పోర్న్ వీడియోలు చూస్తూ, కావాలనే శ్రీవారి భక్తి ఛానల్ పై దురాభిప్రాయం కలిగించే విధంగా ఉద్యోగులే ప్రయత్నించినట్టు అవగతమవుతోంది. విజిలెన్స్ పరిశీలనలో బయటపడిన వాస్తవాలు, శ్రీవారి భక్తుడి ఫిర్యాదు వెరసీ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతోంది. ఇలాంటి బూతు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోకపోతే..త్వరలో జాతీయస్థాయి భక్తిఛానల్ కాబోతున్న ఎస్వీబీసీపై భక్తుల నమ్మకం సన్నగిల్లే ప్రమాదముందని భక్తులు భావిస్తున్నారు.