స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ తో పరకామణికి కొత్త భవనం


Ens Balu
3
తిరుమల
2020-08-31 17:18:57

తిరుమలలో అన్న ప్రసాదం కాంప్లెక్స్ ఎదుట నిర్మించనున్న పరకామణి  నూతన భవనాలు, అందులోని యంత్రాలు, సదుపాయాలు, భద్రత, మౌలిక వసతులతో కలిపి స్టేట్ఆఫ్ఆర్ట్ డిజైన్ తో ఉండాలని టీటీడీ ఈఓ  అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. దాత నిర్మిస్తున్న  ఈ భవనం డిజైన్, కల్పించాల్సిన వసతులపై అదనపు ఈఓ ధర్మారెడ్డి తో కలసి  సోమవారం తిరుపతి పరిపాలన భవనం లోని తన చాంబర్లో ఈఓ  సమీక్ష జరిపారు. సిఈ  రమేష్ రెడ్డి డిజైన్ లేఔట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 22,622 చదరపు అడుగుల విస్తీర్ణం లో ఈ భవనం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 9 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ భవనం సెల్లార్ లో బ్యాంకుల కోసం స్ట్రాంగ్ రూములు, గ్రౌండ్ ఫ్లోర్ లో నాణేల పరకామణి హాల్, హుండీలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం లు డిజైన్ చేసినట్లు చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ లో నోట్లు, బంగారు, ఇతర కానుకల లెక్కింపు హాల్ ఉంటాయన్నారు. నాణేల పరకామణిలో యంత్రాల శబ్దం రాకుండా సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు కూడా పరకామణి లెక్కింపు చూడవచ్చని ఆయన చెప్పారు.  ఈఓ  సింఘాల్ మాట్లాడుతూ నాణేలు వాటి విలువను బట్టి వేరు చేసే యంత్రాల ఏర్పాటు, లెక్కింపు, భద్రత, విద్యుత్, అగ్నిమాపక పరికరాలు, సిసి టివి ల ఏర్పాటు, డోనార్ హాల్, సిబ్బంది సదుపాయాల విషయాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితమైన ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యంత్రాల సహాయంతో తక్కువ మంది సిబ్బందితో  పారదర్శకంగా, వేగంగా లెక్క పెట్టే వ్యవస్థ ఏర్పాటు, తనిఖీలు,  పరకామణి భవనం కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ గదుల నిర్మాణం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.   సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏఓ  బాలాజి, ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్ష లో పాల్గొన్నారు.