స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీలో చదివితే ఉద్యోగం రావాలి..


Ens Balu
5
Velagapudi
2020-09-01 15:22:11

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందనే భరోసా కలిగేలా పాఠ్యప్రణాళిక తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్కిల్ డెవలెప్ మెంట్  కాలేజీల కోసం ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి మేకపాటి గౌతం రెడ్డితో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. సీఎం మాట్లాడుతూ, ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్దిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషించేలా ఉండాలన్నారు. దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ చేస్తున్నామని అధికారులు సీఎంకి వివరించారు. కోర్సులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధంచేశామని, ఫినిషింగ్‌ స్కిల్‌కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు.. ఇలా రెండు రకాలుగా స్కిల్‌ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు సీఎంకి వివరించారు. 162కి పైగా కోర్సుల ద్వారా ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పిన అధికారులు ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్‌ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయని చెప్పారు.   ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాల ఉండేలా మొత్తం రాష్ట్రంలో 30 కశాశాలల నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పాఠ్యప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామని, సింగపూర్‌ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్‌  హాల్‌ లారెన్‌స్టెన్‌ (యూనివర్శిటీ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌), డిపార్ట్‌ మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ భాగస్వామ్యాన్ని తీసుకున్నామని తెలిపారు. అలాగే మరో 23 ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం, వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని, మరో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయని అధికారులు వివరించారు. ల్యాబ్‌ ఏర్పాట్లు, పాఠ్యప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నామని, ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బియోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు.  అలాగే వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో కూర్చుని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలని సూచించారు. హై ఎండ్‌స్కిల్స్‌తోపాటు ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైన యువతకు శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సహా, స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్‌ సెక్రటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.