మహిళా పోలీస్ విధు(శెలవు)లెక్కడ..?


Ens Balu
17
Tadepalli
2021-07-22 01:59:49

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ముందుచూపులేని కొన్ని నిర్ణయాలు, ఉత్తర్వులు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు తెచ్చిపెడుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14వేలకు పైగా వున్న మహిళా పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. ఫలితంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది వారి పరిస్థితి.. ఖాకీ చొక్కాలేని, పేరుకే పోలీసులైన గ్రామ, వార్డు పోలీసులకు పోలీస్ శాఖలోని హోంగార్డులు, కానిస్టేబుళ్లు, కొందరు ఎస్ఐల నుంచి వస్తున్న డిఫరెంట్ కామెంట్లతో వీరంతా చాలా ఇబ్బందులకు గురికావాల్సివస్తుంది. అవెలా వుంటున్నాయంటే.. మీరేమైనా నిజమైన పోలీసులనేసుకుంటున్నారా.. మాలాగ శిక్షణ ఏమైనా తీసుకున్నారా.. మీ ఉద్యోగమే పోలీస్ కానీ పోలీస్.. పేరులో పోలీస్ ఉన్నంత మాత్రాన మీరు పోలీసులైపోరు.. అయినా మాది ఇంటర్ క్వాలిఫికేషన్, మీది డిగ్రీ క్వాలిఫికేషన్ అంటూ ఎవరి స్థాయిలో వారు సచివాలయ మహిళా పోలీసులను వివిధ రకాలుగా మాట్లాడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం వీరి ఉద్యోగనియామకాల సమంలో జీఓనెంబరు 129, ఆ తరువాత జీఓనెంబరు 59లు విడుదల చేసిన పోలీస్ శాఖలో జిల్లా ఎస్పీలు, డిఎస్సీలు తప్పా ఆ జీఓలపై మిగిలిన పోలీసులకు అవగాహన లేదు. అలాగని జిల్లా పోలీసులు సైతం వారికి వివరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితంగా ప్రభుత్వం గుర్తించినంత మాత్రామ మేము మిమ్మల్ని మాతోపాటు సమానంగా పోలీసులుగా ఎలా గుర్తిస్తామా అనే మాటలు మహిళా పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు వీరు విధులు గ్రామాల్లో నిర్వహిస్తున్నప్పటికీ క్యాజువల్ సెలవులు మాత్రం స్టేషన్ లోని ఎస్ఐ లు దగ్గర తీసుకోవాలంటూ ప్రభుత్వే ఉత్తర్వుల్లో మెలిక పెట్టింది. ఇప్పటికే పోలీసులతో సమానంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను ప్రభుత్వం నియమించడాన్ని జీర్ణించుకోలేని పోలీస్ శాఖలోని కొందరు సిబ్బంది కావాలనే వీరికి ఇచ్చే సెలవుల విషయంలో పలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క సచివాలయాల్లో కార్యదర్శిలు కూడా వీరి విషయంలో పక్షపాత దోరణి ప్రదర్శిస్తున్నారు. విధులు చేసేది సచివాలయంలోనూ.. మీకు సెలవులు ఇచ్చేది మాత్రం స్టేషన్ ఎస్ఐలా అంటూ మాట్లాడుతున్నారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసుల సర్వీసులు కూడా రెగ్యులర్ కాకపోవడంతో వీరంతా అటు హోంగార్డు నుంచి కానిస్టేబుల్, ఎస్ఐ వరకూ అనే అన్ని రకాల మాటలు పడాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వ శాఖలో అయినా రాష్ట్ర ఉన్నతాధికారులు జీఓలు ఇచ్చినపుడు వాటిని జిల్లా అధికారులు అమలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జిల్లా అధికారులే మండల అధికారులకు జీఓలోని ముఖ్యమైన అంశాలను మండల, ప్రాంతీయ అధికారులకు వివరించి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలనే ఆదేశాలు జారీ చేస్తారు. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువా సుమారు 14 ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్లు ఇచ్చిన ఆదేశాలు ఏ ప్రభుత్వశాఖలోనూ అమలు కావడం లేదు. ఏ ఒక్కశాఖ జిల్లా అధికారి కూడా మండల స్థాయిలో ఆ జీఓలను సచివాలయాలకు ప్రోటోకాల్ రూపంలో తెలియజేయజేసే ప్రయత్నం చేయలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే తామంతా పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నామనే ఒకే ఒక్క బలమైన నమ్మకంతో చాలా ఇబ్బందులు పడుతూనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులందరికీ సచివాలయ కార్యదర్శిలు(డిడిఓ)లే సెలవులు మంజూరు చేస్తారు. ఐదు అంతకంటే ఎక్కువ రోజులు కావాల్సి వస్తే ఆయాశాఖల జిల్లా అధికారులు, మండల శాఖ అధికారుల అనుమతులు పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులకు విధులు సచివాలయంలోనూ, సెలవుల అనుమతి పోలీస్ స్టేషన్ లో పెట్టడంతో ఆ సెలవుల సమయంలో స్టేషన్ పోలీసుల నుంచి వీరంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇలాటి విషయాలన్నీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతుంది. ఇక్కడ విచిత్రంగా సచివాలయ మహిళా పోలీసులపై తమ అనుమానాలు, భయాలు, మనసులో వున్న ఆలోచనలతో మాట్లాడే మాటలన్నీ పోలీసు విభాగంలోని ఇంటెలిజెన్స్ మాటలను డిజిపి ద్రుష్టికి తీసుకెళ్లడంలో పక్షపాత దోరణి అవలంభిస్తున్నారు. లేదంటే నిజంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసులను పోలీస్ శాఖలోని కొందరు పోలీసులు అనే మాటలు ఈ పాటికే రాష్ట్ర డిజిపి కార్యాలయానికి చేరాల్సి వుంది. అలా చేరితే అన్ని జిల్లాల ఎస్సీలకు, అన్నిడివిజన్ల ఏఎస్పీలు, డిఎస్పీలకు ఖచ్చితమైన ఆదేశాలు వచ్చేవి. అలా రాకపోవడం వలన పోలీసులు తమ విధులు, గౌరవానికి గ్రామస్థాయిలో ఎక్కడ భంగం వాటిల్లిపోతుందోననే భయంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైగా మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు ఇచ్చే విషయంలో కూడా మొదట కానిస్టేబుళ్లకే ఇష్టం లేని విషయాన్ని ఇపుడు మహిళా పోలీసుల నుంచి తమ ఆలోచనలు తీసుకు స్థాయికి చేర్చాయి( మీకు ఖాకీ డ్రెస్సు కావాలా సివిల్ డ్రెస్సు కావాలా). ఈ తరుణంలో క్యాజువల్ సెలవుల విషయంలో మహిళా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాకపోతే తమ ఇబ్బందులను నేరుగా జిల్లా ఎస్పీలకు చెప్పుకోలేని స్థితిలో వున్న మహిళా పోలీసుల క్యాజువల్ లీవుల సమస్య, వీరు ఎదురుపడితే స్టేషన్ పోలీసులు చేసే కామెంట్ల సమస్యలు ఎప్పటికీ తీరుతాయోనని వీరంతా ఆందోళన చెస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే మహిళా పోలీసులుగా చేరిన చాలా మంది పోలీసులు నుంచి వస్తున్నా ఈ కామెంట్లను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 మంది వేరే ఉద్యోగాలొచ్చిన సందర్భంలో ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో వారు చెప్పే మాటలు విన్నవారికి నిజంగా స్టేషన్ పోలీసుల నుంచి ఈ స్థాయిలో కామెంట్లు వస్తున్నాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  క్యాజువల్ లీవులు, స్టేషన్ పోలీసులు చేసే కామెంట్ల విషయంపై రాష్ట్ర డిజీపీ నిర్ధిష్ట ఆదేశిలిస్తే ఈ కామెంట్లు, సెలవుల విషయం కొలిక్కి వచ్చేటట్టు కనిపించడం లేదు..చూడాలి ఏం జరుగుతుందనేది..!