పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతన దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కు వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గత వారం పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఈరోజు మరికొందరు రాజీనామా చేస్తారనే వార్తలొస్తున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు 4 మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో దిగువ సభలో ప్రభుత్వ మిత్రపక్షాలన్నీ ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతున్నాయని పర్వేజ్ ఎలాహి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఉందని, అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అత్యంత దారుణంగా సొంతపార్టీ మంత్రులే ప్రభుత్వాన్ని కూల్చేసిన ప్రభుత్వంగా పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వార్తల్లోకి ఎక్కనుంది.