కేంద్ర రవాణా, జాతీయరహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెక్ రిపబ్లిక్ లో హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్ కు వెళ్లారు. అత్యంత అధునాతన సాంకేతికతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సులో ఆయన ప్రయాణించారు. బస్సును పూర్తిగా పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గడ్కరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సులు హైడ్రోజన్ వాయువును వాడుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొంటాయి. ప్రపంచదేశాలు ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలకంటే బ్యాటరీ, హైడ్రోజన్ వాహనాల తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి హైడ్రోజన్ బస్సులో ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్న ఆయన ప్రేగ్ లో నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో గడ్కరీ పాల్గొన్నారు.