ఒడిషా–ఏపిల మధ్య సమస్యల పరిష్కారానికి సిఎం కృషి..


Ens Balu
11
Srikakulam
2021-11-07 12:47:53

శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన వంశధార – నేరేడి ప్రోజెక్ట్ నిర్మాణంలోని సమస్యలు తొలిగి త్వరలోనే పూర్తిచేసుకోనున్నట్లు మాజీమంత్రివర్యులు, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టౌన్ హాలులో ఈ మేరకు ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి ప్రోజెక్టు నిర్మాణంపై చర్చించనున్నట్లు చెప్పారు. సిఎం చేస్తున్న అవిరళ కృషితో ప్రోజెక్టుకు ఒడిషాతో ఉన్న జలవివాద సమస్యలకు చరమగీతం పడనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 1962లో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నేరేడి బ్యారేజుకు శంకుస్థాపన చేసారని, అది నేటికి సఫలం కాలేదన్నారు. సరిహద్దు రాష్ట్రమైన ఒడిషాతో తలెత్తిన బేధాభిప్రాయాల వలన గడిచిన 62 ఏళ్లలో బ్యారేజ్ నిర్మాణానికి నోచుకోలేదని, ముఖ్యమంత్రి తీసుకున్న సాహోసోపేతమైన నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పెద్ద వరం కాబోతుందని తెలిపారు. ఇందుకు  జిల్లా ప్రజలు, రైతాంగం తరపున హృదయపూర్వక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు లభించారని, ఈగోలకు పోకుండా ప్రజల మంచి చెడ్డలను ఆలోచించి, జీవనప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పనిచేయడం ఉన్నతమైన సంప్రదాయమని, ఆ సంప్రదాయం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని ఆయన స్పష్టం చేసారు. జిల్లా ప్రజల కోసం సిఎం తీసుకుంటున్న చర్యను అందరూ అభినందించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆంధ్రా ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు  ఉందని, ప్రజల కోసం ఆలోచించే ఆదర్శవంతమైన వ్యక్తి నవీన్ పట్నాయక్ అని కొనియాడారు. 1936కు ముందు శ్రీకాకుళం ఒడిషా రాష్ట్రంలో ఉండేదని, తదుపరి ఆంధ్రా ప్రాంతంగా విభజించబడిందని ఆయన గుర్తుచేసారు. నేరేడి బ్యారేజ్ నిర్మాణంలో కోర్టులు ఇచ్చే తీర్పులు కంటే నేరుగా సిఎం గారిని కలిసి సమస్యలను పరిష్కరించుకోవడం సంతోషకరమని, సిఎం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఈ ప్రోజెక్టు నిర్మాణంతో ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద ప్రోజెక్టు కాగలదని ధర్మాన పేర్కొన్నారు. ఈ ప్రోజెక్టును నాటి ముఖ్యమంత్రి దివంగత డా.వై.యస్.రాజశేఖరరెడ్డి మంజూరుచేసారని, రాష్ట్రంలో జలయజ్ఞం పేరిట ఒకే టెర్ములో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రోజెక్టులకు శ్రీకారం చుట్టారని అన్నారు. అందులో భాగంగానే వంశధార, తోటపల్లి, మడ్డువలస- ఎక్స్ టెన్షన్, మహేంద్రతనయపై నిర్మించిన ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించబడ్డాయని, తోటపల్లి పూర్తయిందని, వంశధార ప్రోజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద ప్రోజెక్టు వంశధార అవుతుందని అన్నారు. బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే జల ఒప్పందం ప్రకారం మన వాటాకు 57.5 టి.ఎం.సిలు వస్తాయని, ఆ వాటాలో 45 టి.ఎం.సిల నీటిని ఇపుడే వినియోగించుకునే అవకాశం ఉందని ఇంజినీరింగ్ అధికారుల సమాచారమని ఆయన వివరించారు. ఒడిషాకు పెద్దఎత్తున నీటివనరులను వినియోగించుకునే భూభాగం గాని అవకాశంగాని, అనువుగా లేదన్నారు. ఇటువంటి పరిస్థితిల్లో నీటిని వృధా కానివ్వకుండా భారతీయులుగా గుర్తించి విశాలమైన ఈ ఒప్పందాన్ని అమలుచేయడానికి నవీన్ పట్నాయక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రజలందరి తరపున వినమ్రంగా కోరుతున్నట్లు చెప్పారు. ఇది ఒడిషా ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల వాదన, ఆవేదన, కోరిక, మనోవాంఛ అని, ఇది రేపటి సమావేశానికి దోహదం కావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలతో జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీరనుందని ధర్మాన స్పష్టం చేసారు.