సూపర్ జీఎస్టీ –సూపర్ సేవింగ్స్ తో మత్స్యరంగానికి ఆర్ధిక ఊతం - మత్స్యశాఖ జాయింట్ డెరెక్టర్ - ఎన్ .నిర్మలా కుమారి


Ens Balu
31
rajamahendravaram
2025-10-01 03:38:57

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్య రంగానికి గణనీయమైన లాభాలను అందిస్తున్న కొత్త జీఎస్టీ సర్దుబాట్లను ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని జిల్లా మత్స్య అధికారి / సంయుక్త సంచాలకులు ఎన్. నిర్మలా కుమారి పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో జి ఎస్ టి ప్రచార కార్యక్రమం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త సంచాలకులు  ఎన్. నిర్మలా కుమారి మాట్లాడుతూ, సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్" ప్రచారం, సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చిందని అన్నారు . జీఎస్టీ రేట్ల తగ్గింపుల ప్రయోజనాలను ఆక్వా రైతులు, మత్స్యకారులు  ఇతర వాటాదారులకు తెలియజేయడానికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. జీఎస్టీ లాభాలు తెలుసుకొని వాటిని సహచర మత్స్యకారులకు కూడా తెలియజేయడం వలన ప్రయోజనం పొందడానికి ఆస్కారం వుంటుందని వివరించారు. ఇందులో ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన చేపలు, రొయ్యలు, చేప నూనెలు మరియు సేంద్రియ సారములపై జీఎస్టీ 12% నుండి 5%కి తగ్గించబడింది. ఆక్వాకల్చర్ పరికరాలు, ఇన్పుట్ సబ్సిడీ , ఫిషింగ్ గేర్, అమోనియా, సూక్ష్మ పోషకాలు , ప్రాసెసింగ్ సేవలపై కూడా జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుందన్నారు.  ఈ చర్యలు వలన మత్స్య రైతుల నిర్వహణ ఖర్చులను తగ్గించి, మత్స్య రంగంలో పోటీతత్వాన్ని పెంచుతాయి. జీఎస్టీ ద్వారా ఆక్వాకల్చర్ రంగంలో లబ్ధి పొందే ఇతర మార్గాలు వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్సడాలో నమోదు చేసుకున్న ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్కు రూ.1.50 చొప్పున రాయితీ అందిస్తోంది. నాన్-ఆక్వా జోన్లోని ఆక్వా ఫారమ్లకు కూడా విద్యుత్ రాయితీ పొడిగింపు పరిగణనలో ఉందన్నారు. ఈ సౌకర్యం ద్వారా ఏకరానికి సగటున రూ.20,000 ఆదా సాధ్యమవుతుంది. కేంద్ర బడ్జెట్ 2025–26 ద్వారా రొయ్యల మేత, చేపల మేత మరియు వివిధ ఇన్పుట్ పై కస్టమ్స్ సుంకం కూడా తగ్గించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మార్పులు ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడమే కాకుండా, స్థానిక మత్స్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం భారతీయ ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ ప్రయోజనాలన్నీ గ్రామస్థాయిలో మత్స్యసహాయకులు మత్స్య కార రైతులకు తెలియజేయాలని ఆదేశించారు.  మత్స్య రంగం జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో సమన్వయ అధికారులు మత్స్య శాఖ సహాయ సంచాలకులు టి. సుమలత, మత్స్య అభివృద్ధి అధికారులు ఎస్. గణేశ్వరరావు, ఎం. బ్రహ్మనందం, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కోరుకొండ కె. హరీష్ , నరేంద్రపురం గ్రామ సర్పంచ్ తంగెళ్ల ముసలయ్య, నరేంద్రపురం మత్స్యకారుల సహకార సొసైటీ అధ్యక్షులు బొర్రా ముత్యాలు, సూర్యారావు పేట ఎఫ్సీఎస్ అధ్యక్షులు రాపాక ముసలయ్య,  చేపల పెంపకందారులు మరియు మత్స్యకారుల సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.