నిర్దేశిత కాల వ్యవధిలో గృహాలు పూర్తి చేయాలి..
Ens Balu
4
Srikakulam
2021-11-07 13:03:21
ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధిలో గృహ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను నిరుపేదలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అందులో మొదట విడత గా సుమారు 16 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 10,237 ఇల్లు నిర్మాణం దశ లో ఉన్నాయని చెప్పారు.ఇంకా నిర్మాణం ప్రారంభించని గృహాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు సలహాలు, సూచనలు అందజేసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసే విధంగా సహాయ పడాలని సూచించారు. ప్రతి లే అవుట్ అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నక్కా గణపతి, డిఇ గాలి రామ్మూర్తి, బొడ్డేపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.