ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి..
Ens Balu
3
Vizianagaram
2021-11-11 16:23:21
స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారత దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. గురువారం ఆయన జయంతిని పురస్కరించుకొని స్థానిక ఉర్దూ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ముఖ్య అతిథిగా, జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లలే రేపటి తరం భవిష్యత్తని.. వారిని బాగా చదివించాలని సూచించారు. ఈ క్రమంలో కాసేపు ఉర్దూ పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. అందరూ బాగా చదువుకోవాలని, గొప్పవారు కావాలని ఆకాంక్షించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్, జేసీలు పరిశీలించారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. అరుణ కుమారి, డీఈవో సత్యసుధ, ముస్లిం పెద్దలు, మహిళలు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.