ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నవి అలా కొనసాగవచ్చని, ప్రభుత్వానికి అప్పగించాలని ఎటువంటి వత్తిడి లేదని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టరు ఈ విషయముపై జిల్లాలోని ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమన్యాలు/ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశమునును తప్పుగా అర్ధం చేసుకోవలదని సూచించారు. విద్యా సంస్థలు, విద్యార్ధుల ఇంటరెస్ట్ లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తగు చర్యలు ఉంటాయని, ఎటువంటి వత్తిడి ఉండదన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి అయ్యే వరకు ఎటువంటి మార్పులు ఉండదన్నారు. అంగీకారం తెలిపిన పాఠశాలలోని విద్యార్దులను అసౌకర్యం లేకుండా దగ్గరలోని పాఠశాలలలో మాత్రమే చేర్చడం జరుగుతుంది. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ నీయమని, ఆందోళన చెందవద్దని తెలియజేశారు. ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు పునరాలోచించుకొని వారి నిర్ణయాన్ని తెలుప వచ్చన్నారు.
ఈ విషయంలో ఎవరికైనా ఎటువంటి సందేహలున్నా అడిగి నివృత్తి చేసుకోవచ్చన్నారు. పాఠశాలల యాజమన్యాలెవరూ కూడా ప్రచారం కోసం, అశాంతిని కలుగజేసి సమస్యలు సృష్టించరాదని హెచ్చరించారు. విద్యార్దులు వారి తల్లి దండ్రులలో పూర్తి నమ్మకం కలుగ జేయాలన్నారు.
ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు వారిపై ఎటువంటి వత్తిడి లేదన్న విషయాన్ని గ్రహించాలని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసం ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా విద్యా శాఖాధికారి ఎల్. చంద్రకళ, జిల్లా వృత్తివిద్య అధికారి కె.అప్పలరాము, డిగ్రీ కళాశాలల కోఆర్డినేటర్ విజయకుమార్, 8 డిగ్రీ కళాశాలలు, 15 జూనియర్ కళాశాలలు, 32 పాఠశాలలుకు చెందిన ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు.