తుపాను నష్టాన్ని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి..
Ens Balu
7
Vizianagaram
2021-11-12 08:17:10
విజయనగరం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, అయితే ఇంతవరకూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిశోర్ కుమార్ తెలిపారు. మరో రెండు రోజులు తుఫాన్ హెచ్చరికలు ఉన్నందున మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని అన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు తో కలసి జె.సి కిషోర్ కుమార్ శుక్రవారం కంట్రోల్ రూమ్ ను సందర్శించి రియల్ టైం మాప్ ల ద్వారా, వర్ష పాతాన్ని, అల్ప పీడనం దిశ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రెవిన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని డి.ఆర్.ఓ కు సూచనలు జారీ చేశారు. తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది పని చేసే చోటే ఉండాలని అన్నారు. తుఫాన్ వలన ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ కి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఇప్పటికే కోత చేసి పొలాల్లో ఉన్న వరి పంట నష్టం జరగకుండా టార్పలీన్ కప్పాల న్నారు. కోత దశ లో ఉన్నందున పొలంలో నీరు నిల్వ లేకుండా చూడాలని, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిగించేలా చూడాలని జె.డి కి సూచించారు. నూర్పు చేసిన ధాన్యాన్ని సమీప సేకరణ కేంద్రం అయిన రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి తేమ శాతాన్ని తనిఖీ చేసుకోవాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో శుక్రవారం ఉదయానికి అత్యధికంగా గరివిడి లో 27.2 మిమి లు, అత్యల్పంగా కోమరాడ మండలం లో 5.2 మిమి ల వర్షపాతం నమోదైందని తెలిపారు.