స్కానింగ్ కేంద్రాలు నివేదికలను సమర్పించాలి..


Ens Balu
4
Srikakulam
2021-11-12 14:23:27

శ్రీకాకుళం జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు విధిగా తమ స్కానింగ్ వివరాలను ఆన్ లైన్ లో సమర్పించాలని స్పష్టం చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో నెలరోజుల్లోగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి వ్యత్యాసం ఎక్కువగా ఉందని, ఇది భవిష్యత్తుకు మంచిది కాదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉండటం సంతోషాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాధ రావు మాట్లాడుతూ కంచిలి, ఆమదాలవలస, హిరమండలం, సరుబుజ్జిలి, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉందని అన్నారు. స్కానింగ్ కేంద్రాల నిర్వహణపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.జయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కే. శ్రీనివాసులు, అదనపు ఎస్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కె. రామ్మూర్తి, లీల, కే.అప్పారావు, కృష్ణ మోహన్, బి.సూర్యారావు, జెమ్స్ ఆసుపత్రి టి.తిరుపతి రావు, యూత్ క్లబ్ అధ్యక్షులు ఎం. ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.