ఉత్తరాంధ్రను వెక్కిరిస్తే చూస్తూ ఊరుకోం..
Ens Balu
6
Narasannapeta
2021-11-14 13:03:45
అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్రగా మిగిలిపోయిందని, ఈ యాత్ర లక్ష్యం మిగతా ప్రాంతాలవారిని వెక్కిరించటం, రెచ్చగొట్టడంలా మారిపోయిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులకు విత్తనాలు ఇన్పుట్ పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం, చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టేలు తీసుకురావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాలమీద దండయాత్ర కాదా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంటే చంద్రబాబు మాత్రం తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నష్టం రాకూడదని ఈ యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి యాత్ర కాస్త భ్రమరావతి యాత్రగా మారిపోయిందనీ, యాత్రకు న్యాయస్థానం టూ దేవస్థానం అని పేరుపెట్టారు కానీ దౌరజన్యం టూ దౌర్జన్యం అనో.. మోసం టూ మోసం అనో పేరు పెడితే బాగుండేదని చెప్పారు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబే నని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని, మూడు ప్రాంతాల అభివృద్ధి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని కృష్ణదాస్ స్పష్టం చేశారు.