ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ స్మార్ట్ సిటి శివనామ స్మరణతో మార్మోగిపోయింది. కార్తీకమాసం రెండవ సోమవారం అందునా ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శివలయాల్లో పూజలు నిర్వహించారు. భానుగుడి దగ్గర్లోని శివాలయంలో నందీశ్వరుడిని దర్శించుకొని శివుని అనుగ్రహం కోసం పూజలు చేపట్టారు. భోళా శంకరుడిని ప్రశన్నం చేసుకోవడానికి ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. సూర్యోదయ సమయంలో సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివుడికి దీపోత్సవం నిర్వహించారు. క్షీరాభిషేకాలు చేసి హారతులు పట్టారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం రోజున శివునికి అభిషేకాలు చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని శివాలయ ప్రధాన పూజరి శ్రీనివాస శర్మ చెప్పారు. ఉదయం పూజలు చేసింది మొదలు సాయంత్రం వరకూ ఈరోజు భక్తులు ఉపవాసాలు ఉండి మళ్లీ సాయంత్రం శివునికి పూజలు చేస్తే ఉపవాస ఫలితం వుంటుందని పేర్కొన్నారు. తెల్లవారు జామున ఐదుగంటల నుంచే నగరంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.