జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ ప్రక్రియ ను వేగంగా జరిగే లా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి మండల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఎం పి డి ఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకా ధికారులతో ఓ.టి.ఎస్ పై టీమ్ కాన్ఫరెన్స్ ద్వారా మండల వారీగా పురోగతి పై సమీక్షించారు. అనేక మండలాల్లో సున్నా ప్రగతి ఉందని, మంగళవారంలోగా ఎక్కడా జీరో కనపడకూడదని, వి.ఆర్ ఓ లు తమ పనితీరు చూపించేలా లక్ష్యాలను చేరాలని అన్నారు. మండల ప్రత్యేకాధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల తో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఓ.టి.ఎస్. పై అవగాహన కల్పించి, గ్రామాల్లో ప్రచారం జరిగేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ జరిపి ఓ.టి.ఎస్ విధి విధానాలను వివరించాలన్నారు. ఎంత చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి , దాని వలన లాభాలేంటి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. పట్టాలు, భూ సమస్యలు ఉన్న చోట జె.సి రెవిన్యూ పరిష్కరిస్తారని, వారి దృష్టి లో పెట్టాలని అన్నారు. విజయనగరం అర్బన్, రూరల్ లో పురోగతి తక్కువ గా ఉందని, జె.సి రెవిన్యూ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ డేటా ఆమోదం అయితేనే చలానా జెనరేట్ అవుతుందని, అప్పుడే చెల్లింపులకు అవకాశం ఉంటుందని, ముందుగా క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేసి డేటా వెరిఫై చేయాలని సూచించారు. ఓ.టి.ఎస్ పై ముద్రించిన కరపత్రాలను వాలంటీర్ ల ద్వారా గ్రామాల్లో అందరికి అందేలా చూడాలని అన్నారు. ఓ.టి.ఎస్ చెల్లింపు చేసిన వారి వివరాలను పత్రికల ద్వారా ప్రచారం జరగాలన్నారు. గడువు లోగా లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రత్యేకధికారులు పూర్తి గా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ టీమ్ కాన్ఫరెన్స్ లో జె.సి రెవిన్యూ డా. కిషోర్ కుమార్, హౌసింగ్ పి.డి కూర్మినాయుడు, హౌసింగ్ సహాయ ఇంజినీర్లు , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.