భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
3
Vizianagaram
2021-11-15 15:50:25
విజయనగరం ఈ నెల 17,18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఒక ప్రకటన ద్వారా సూచించారు. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది నెమ్మదిగా నైరుతి దిశగా కదులుతోందని భారత వాతావరణశాఖ హెచ్చరించినట్లు తెలిపారు. ఇది వాయుగుండంగా మారి, ఈనెల 18న మన రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. అందువల్ల 17,18 తేదీల్లో భారీ వర్షాలతోపాటు, గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ఈ మేరకు మత్స్యకారులను అప్రమత్తం చేయాలని, జిల్లా మత్స్యశాఖను కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలను, ఈదురు గాలులను దృష్టిలో పెట్టుకొని, ఆర్‌డిఓ, సబ్ కలెక్టర్‌తోపాటు అన్ని మండలాల తాశీల్దార్లు, ఎంపిడిఓలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగిన పక్షంలో, తక్షణమే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూముకు సమాచారాన్ని అందించాలని సూచించారు.