దేశ చ‌రిత్ర‌పై విద్యార్ధుల‌కు అవ‌గాహ‌న వుండాలి..


Ens Balu
5
Vizianagaram
2021-11-15 15:55:12

దేశ చ‌రిత్ర‌, మ‌న‌ సంస్కృతి త‌దిత‌ర అంశాల‌పై విద్యార్దుల్లో అవ‌గాహ‌న వుండాల‌ని స‌మాచార పౌర‌సంబంధాల శాఖ స‌హాయ సంచాల‌కులు, జిల్లా గ్రంథాల‌య సంస్థ డైర‌క్ట‌ర్‌ డి.ర‌మేష్ అన్నారు. గ్రంథాల‌య వారోత్స‌వాల్లో భాగంగా స్థానిక గుర‌జాడ కేంద్ర గ్రంథాల‌యంలో జిల్లా గ్రంథాల‌య సంస్థ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన చారిత్ర‌క పుస్త‌కాల ప్ర‌ద‌ర్శ‌నను స‌మాచార శాఖ ఏ.డి. సోమవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ విద్యార్ధుల‌కు త‌మ స‌బ్జెక్టుల‌కు సంబంధించిన విష‌య ప‌రిజ్ఞానంతోపాటు త‌మ దేశం, త‌మ ప్రాంత చ‌రిత్ర‌, దేశ నాయ‌కులు, చారిత్ర‌క వ్య‌క్తుల‌కు సంబంధించిన ప‌రిజ్ఞానం అవ‌స‌ర‌మ‌న్నారు. చ‌రిత్ర‌కు సంబంధించిన అన్ని పుస్త‌కాల‌ను ఒకేచోట పాఠ‌కుల‌కు అందుబాటులో వుంచి మంచి అవ‌కాశం క‌ల్పించిన జిల్లా గ్రంథాల‌య సంస్థ‌ను అభినందించారు. పుస్త‌క పఠ‌నాన్ని అల‌వాటు చేయ‌డంలో గ్రంథాల‌య వారోత్స‌వాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా గ్రంథాల‌య వారోత్స‌వాల రెండో రోజున పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశామ‌ని గ్రంథాల‌య సంస్థ కార్య‌ద‌ర్శి ఎన్‌.ల‌లిత‌, జిల్లా కేంద్ర గ్రంథాల‌య అధికారి గోపాల‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.