రక్తదానం ప్రాణదానంతో సమానం..


Ens Balu
9
Srikakulam
2021-11-17 16:44:45

రక్తదానం ప్రాణదానం అని సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కే. సూర్య ప్రభాకర్ అన్నారు. బుధవారం స్థానిక ఆదిత్య కళాశాల విద్యార్థులు రక్తదానం చేయుటకు ముందుకు వచ్చి తమ కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రభాకర్ హాజరయ్యారు. రక్త దానం చేయుటకు ముందుకు వచ్చిన యువతను ప్రశంసించారు. రక్త దానం సమాజంలో స్ఫూర్తి నింపుతుందని, యువత సామాజిక అంశాల పట్ల స్పందించడం మంచి పరిణామమని ఆయన అన్నారు. జిల్లాలో అవసరం ఉన్న యూనిట్ల కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించడం కష్టమవుతుందని ప్రభాకర్ చెప్పారు. రెడ్ క్రాస్ సౌజన్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల కళాశాల యాజమాన్యంను ఆయన అభినందించారు.   ఆదిత్య కళాశాల కరస్పాండెంట్ గుప్త లడ్డు మాట్లాడుతూ ప్రతి ఏడాది రక్తదాన శిబిరాన్ని తమ కళాశాల నిర్వహిస్తూ కొంతమేరకు ప్రాణాలు కాపాడుటకు తోడ్పాటును అందిస్తున్నామనే ఆనందం పొందుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్, నెహ్రూ యువ కేంద్ర ఇంచార్జ్ డి. శ్రీనివాస్,  ఆదిత్య కళాశాల అధ్యాపకులు భాస్కర్, రెడ్ క్రాస్ ప్రతినిధి మరియు యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.