అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్.. అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై కలెక్టర్ హరికిరణ్.. జేసీ (ఆర్) సుమిత్ కుమార్, జేసీ (డీ) కీర్తి చేకూరి; ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డబ్ల్యూ), జేసీ (హెచ్) ఎ.భార్గవ్‌తేజతో కలిసి వర్చువల్ విధానంలో ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు.. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలను తు.చ. తప్పకుండా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఆర్‌బీకేల ద్వారా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు మండల స్థాయిలో సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. మిల్లర్లకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను ఈ నెల19 నాటికి సమర్పించే విధంగా చూడాలన్నారు. జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందించేందుకు పంట నష్టం వివరాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వాస్తవ సాగుదారులకు నష్టపరిహారం అందే విధంగా పారదర్శకంగా గణాంకాల సేకరణ చేపట్టాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు కార్యక్రమానికి సంబంధించి అయిదు దశల ప్రక్రియ పూర్తికి జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు సమన్వయంతో కృషిచేయాలన్నారు. జేసీ (ఆర్) సుమిత్ కుమార్.. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట నష్టం వివరాల సేకరణ, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి.. సీజనల్ వ్యాధులు, కోవిడ్ వ్యాక్సినేషన్, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, జగనన్న భూ హక్కు భూ రక్షా, గ్రామ/వార్డు సచివాలయాల్లో సేవలు తదితర అంశాలపై సమీక్షించారు. అదే విధంగా ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డబ్ల్యూ), జేసీ (హెచ్) ఎ.భార్గవ్‌తేజ.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు సర్వే, జగనన్న చేదోడు రీవెరిఫికేషన్, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పింఛన్లు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిశోర్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సీవీ ప్రవీణ్ ఆదిత్య, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, సివిల్ సప్లయ్స్ జోనల్ మేనేజర్ డి.పుష్పమణి, జిల్లా మేనేజర్ ఇ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్రసాదరావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, సీపీవో పి.త్రినాథ్ తదితరులు హాజరయ్యారు.