సచివాలయ పరీక్ష నిర్వహణలో అలసత్వం సహించేదిలేదు


Ens Balu
1
Visakhapatnam
2020-09-14 18:32:58

గ్రామ/వార్డు సచివాలయాల పరీక్ష ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ అధికారులను హెచ్చరించారు.  గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలు ఈ నెల 20 తేదీ నుండి 26 వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలకు సంబంధించి  పరీక్ష మెటీరియల్స్ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలలో భద్రత పరచిన రూంలను ఆయన సోమవారం అధికారులతో సందర్శించారు.  స్ట్రాంగ్ రూమ్ లన్నింటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ముందుగానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలని జిల్లా పరిషత్ సిఇఓ ను ఆదేశించారు. స్టేషనరీ, పరీక్ష మెటీరియల్ ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరాలని డిఆర్డిఎ ప్రాజెక్టు అధికారి విశ్వేశ్వరరావును ఆదేశించారు. సిబ్బంది అవసరమైతే తెలియజేయాలన్నారు. యువకులైన సీనియర్ అసిస్టెంట్ కేడర్ గల సిబ్బందినే నియమించుకోవాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం స్టేడియం లోపల, బయట ఉండాలన్నారు. శానిటరీ, తాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల ఇన్ చార్జ్ లకు పరీక్ష మెటీరియల్ పంపిణీ చేసినపుడు రశీదు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంకు మెటీరియల్ కు వచ్చే వాహనాల ట్రాఫిక్ లేకుండా చూడాలని యుసిడి పిడి శ్రీనివాసరావు ను ఆదేశించారు. డ్రైవర్లను ముందుగానే పరిశీలించుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బయట సైనేజస్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషనరీకి ఒక రూం ఏర్పాటు చేసుకోవాలన్నారు.   ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పోలీసు బందోబస్తు ఏర్పాటుకు పోలీసు అధికారులతో మాట్లాడాలని డిఆర్డిఏ పిడిని ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ - 2 పి. అరుణ్ బాబు, డిఆర్ఓ ఎ. ప్రసాద్, డిఆర్డిఏ పిడి విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో నాగార్జున సాగర్, అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, జివిఎంసి అధికారులు, రవాణా శాఖ అధికారులు, ఆర్టీసి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.