ఓటరు నమోదు పక్కాగా నిర్వహించాలి..


Ens Balu
7
Srikakulam
2021-11-20 11:43:16

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటరు నమోదు పక్కాగా ఉండాలని సంయుక్త కలెక్టర్ ఎం.విజయ సునీత బూత్ స్థాయి అధికారులకు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 2022 నాటికి 18 సంవత్సరములు నిండబోవు లేదా నిండిన వారందరికీ తప్పకుండా ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. మొబైల్ అప్లికేషన్ లేదా ఆన్ లైన్ ద్వారా కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే చిరునామా మార్పుకు, ఓటరు కార్డు సవరణకు కూడా అవకాశమున్న సంగతిని ఓటర్లకు వివరించాలని ఆమె పేర్కొన్నారు. ఓటరు సేవలు ఇప్పుడు మరింత చేరువలోకి వచ్చయన్న సంగతిని ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన డోల మోనిక, తల్లి మహాలక్ష్మిలతో జె.సి ముచ్చటిస్తూ ఓటరు నమోదు గురించి ఏ విధంగా తెలిసింది అని ఆరాతీయగా, వాలంటీరు ద్వారా తెలిసినట్లు చెప్పడంతో జె.సి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమ్మరీ రివిజన్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని, దీన్ని అవసరమైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.వెంకటరావు, ఉప తహసీల్దార్ ఎస్.సతీష్, బూత్ స్థాయి అధికారులు డి.వరలక్ష్మి, జి.లత, వి.హరీష్ కుమార్, చైతన్య, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.