ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున పిలుపునిచ్చారు. శనివారం వి ఎం ఆర్ డి ఎ చిల్డ్రన్ ఎరీనా లో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేయాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి వారి తెలివితేటలు మూర్తిమత్వాన్ని బట్టి వారు అభివృద్ధి సాధించే రంగాల కు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. పదవ తరగతి లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అనేక రాయితీలను కల్పిస్తుందని పేద విద్యార్థుల అభివృద్ధికి జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి పథకాలను ప్రవేశపెట్టారని వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. మీ దగ్గర చదువుకున్న వారు ఉన్నత పదవులను అలంకరిస్తే ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించండి అన్నారు. పిల్లలకు మంచి అలవాట్లు ఆరోగ్య సూత్రాలు సమాజం పట్ల అవగాహన పెంపొందించాలి అన్నారు జె వి కె కిట్లు అందరికీ అందేటట్లు చూడాలన్నారు.
జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్ చంద్రకళ మాట్లాడుతూ పాఠశాలలకు మంచి వాతావరణం కల్పించాలని, గదులు పరిసరాలు మరుగుదొడ్ల తో సహా అన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నాడు నేడు పనులను వేగంగా పూర్తి అయ్యే విధంగా సహకరించాలన్నారు. పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకు తగిన బాటలు వేయాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతి కుమారి జీవీఎంసీ డిప్యూటీ డి ఈ ఓ శ్రీనివాస్ రామరాజు డైట్ ప్రిన్సిపాల్ మాణిక్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.