డిగ్రీ లెక్చరర్ ఉద్యోగ పరీక్ష సజావుగా జరగాలి..


Ens Balu
5
Srikakulam
2020-09-14 19:38:00

శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జరగనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షలను పక్కాగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపిరిం టెండెంట్లు, లైజనింగ్ అధికారులు, ఉప తహశీల్ధారులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( ఏపి.పి.యస్.సి ) ప్రత్యేక అనుమతులు ఇచ్చిందని అన్నారు. సెప్టెంబర్ 15, 16 తేదీలలో రాజాంలోని జి.యం.ఆర్.ఐ.టి, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలకు 487 మంది అభ్యర్ధులు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. అభ్యర్ధులు పరీక్షలను రెండు పూటల రాయాల్సి ఉంటుందని,  ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు, అలాగే మధ్యాహ్నం 3.00గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.  అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే హాజరుకావలసి ఉంటుందని, అయితే కోవిడ్ దృష్ట్యా పరీక్షా సమయం ప్రారంభ సమయం వరకు ఏ.పి.పి.యస్.సి ప్రత్యేక అనుమతిని ఇచ్చినట్లు డి.ఆర్.ఓ తెలిపారు. అభ్యర్ధులు తమ హాల్ టికెట్ తో పాటు నాన్ కోవిడ్ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని, కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అభ్యర్ధులు తెలియజేసిన లేదా థర్మల్ స్క్రీనింగ్ నందు కోవిడ్ ఉన్నట్లు రుజువైన వారికోసం ప్రతీ పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ ల్యాబ్ లను ఏర్పాటుచేసినట్లు డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. అలాగే కోవిడ్ దృష్ట్యా అభ్యర్ధులు తమతో పాటు ట్రాన్స్పెరెంట్ వాటర్ బాటిల్ తెచ్చుకునేందుకు ప్రత్యేక అనుమతిని మంజూరుచేయడం జరిగిందని వివరించారు. జిల్లాలోని 4 సెంటర్లకు గాను మూడు సెంటర్లలో దివ్యాంగులు లేరని, జి.యం.ఆర్.ఐ.టి నందు ఒకరు దివ్యాంగులు ఉన్నారని, వారికోసం అభ్యర్ధి ప్రత్యేకంగా అటెండెంట్ ను తీసుకువచ్చుటకు అనుమతిని మంజూరుచేయాలని, లేనియెడల కళాశాల యాజమాన్యం ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కిట్లు తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలని , ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, పోస్టు గ్రాడ్యుషన్ అభ్యర్ధులు పరీక్షలు రాసేందుకు హాజరుకానున్నందున వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని అధికారులకు సూచించారు. అభ్యర్ధులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, మాస్కులను మరచిపోయిన అభ్యర్ధుల కోసం మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని డి.ఆర్.ఓ వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తిన ఏ.పి.పి.యస్.సి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ పైడి ఢిల్లీశ్వరరావు, సెల్ నెం.90145 50915 లేదా 99599 33631 నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. మరో వైపు...జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రానున్న అభ్యర్ధుల కోసం ఏ.పి.యస్.ఆర్.టి.సి బస్సులను సిద్ధం చేసింది. ఉదయం 5.00గం.ల నుండి  ప్రతీ 15 ని.లకు టెక్కలికి,  ప్రతీ 30ని.లకు చిలకపాలెంకు, ప్రతీ 60ని.లకు రాజాం వెళ్లేందుకు ఒక బస్సులను ఏర్పాట్లను చేసింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే బస్సులను గుర్తించేందుకు ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటుచేస్తామని ఆర్.టి.సి అధికారులు డి.ఆర్.ఓ కు వివరించారు. పరీక్షా సమయానికి రెండు గంటలు ముందే అభ్యర్ధులు హాజరుకావలసి ఉన్నందున రాజాం, టెక్కలి వెళ్లే అభ్యర్ధులు ఉదయం 5.45గం.లకే బయలుదేరాలని డి.ఆర్.ఓ దయానిధి అభ్యర్ధులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ యస్.ఓ పి.ఢిల్లీశ్వరరావు, ఏ.యస్.ఓ పద్మప్రియ, చీఫ్ సూపరింటెండెంట్లు, జి.యం.ఆర్.ఐ.టి, శివానీ, శ్రీ వెంకటేశ్వర, ఐతమ్ కళాశాలల ప్రతినిధులు, ఉప తహశీల్ధారులు, లైజనింగ్ అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.