ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి..
Ens Balu
8
Srikakulam
2021-11-24 08:03:07
శ్రీకాకుళం జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో లబ్ధిదారునికి ఇసుక చేరాలన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇసుకపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో ఆయన సమీక్షించారు. ప్రజలకు, ప్రభుత్వ అవసరాలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రీచ్ లను గుర్తించి ఇసుక తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు. నదీ పరీవాహక కొన్ని ప్రాంతాల్లో సందర్శించాలని మైన్స్ డిడిని ఆదేశించారు. శాంతినగర్ వద్ద నిర్మాణం జరుగుతున్న డైక్ పనులు వద్ద ఇసుక తరలించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు లేఖ పెట్టాలన్నారు. గృహ నిర్మాణానికి అవసరమైన స్టాక్ పాయింట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రణస్థలం, రాజాం ప్రాంతంల్లో ఎక్కడా ఇసుక స్టాక్ పాయింట్ లేదని, అక్కడ అవసరమైన భూమి అందుబాటులో లేకపోతే లే ఔట్లను వినియోగించుకోవాలని చెప్పారు. డిశంబరు 1వ తేదీ నాటికి ఇసుకను స్టాక్ పాయింట్ ల వద్ద నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటామని జయ ప్రకాష్ పవర్ వెంచర్స్ జిల్లా ఇన్చార్జి రాజేష్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో డిడి మైన్స్ సిహెచ్ సూర్య చంద్రరావు, ఎడి బాలాజి నాయక్, ఇరిగేషన్ ఎస్ఇ బి, ఆర్ అండ్ బి ఎస్ఇ కాంతిమతి, పంచాయతీ రాజ్ ఎస్ ఇ, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.