సాయుధ దళాల పతాక నిధికి ప్రజలంతా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా, మన జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాలను దేశం ఎన్నడూ విస్మరించజాలదని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. పాకిస్తాన్, చైనా యుద్ద సమయాలలోను, కార్గిల్ పోరాటంలో, ముంబాయి తాజ్ హోటల్ దురాక్రమణ సమయంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను మన సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు, జాతి యావత్తు గర్విస్తోందని తెలిపారు. ఎంతో మంది సైనిక సహోదరులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించారని, వారికి మనమందరం ఎంతగానో ఋణపడి ఉన్నామని పేర్కొన్నారు. ఆ సాహసోపేత వీర జవాన్లకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు, సాయుద దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ పర్వదినం సందర్భంగా పతాక నిధికి విరివిగా విరాళాలను అందించాలని, జిల్లాలోని పౌరులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామిక వేత్తలకు విజ్జప్తి చేశారు. విరాళాలను జిల్లా సైనిక సంక్షేమ అధికారి, విజయనగరం వారి పేరుమీద, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబరు 52065221666, IFSC CODE; SBIN0020931, MICR NO.535002017 నందు గాని డైరెక్టర్, సైనిక వెల్ఫేర్, విజయవాడ పేరున చెక్కు / డ్రాఫ్ట్ తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, విజయనగరం వారికి పంపించాలని సూచించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఈనెల 7వ తేదీన, యన్.సి.సి. విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వచ్చి విరాళాలు సేకరిస్తారని, వారికి విరాళాలను విరివిగా అందించి మాజీ సైనికుల సంక్షేమానికి తమవంతుగా సహకారాన్ని అందించాలని కోరారు. పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్నురాయితీ లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.