దేశ రక్షణలో అమరులైన, క్షతగాత్రులైన సైనిక మరియు మాజీ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాలని పౌరులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ విజ్ఞప్తి చేసారు. సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా మంగళవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమ తొలి విరాళాన్ని అందించి సాయుధ దళాల పతాక దినోత్స వేడుకలను లాంఛనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణ కొరకు అహర్నిషలు శ్రమించి ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. దానికొరకు పతాక నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా ప్రజలను, పారిశ్రామిక, వ్యాపారవేత్తలను కోరారు. కరోనా నేపధ్యంలో గత రెండేళ్లుగా సైనిక కుటుంబాల సంక్షేమానికి విరాళాలు అందలేదని, ఈ ఏడాదిలో అందరూ విరివిగా విరాళాలు అందించి సైనిక కుటుంబాల సంక్షేమానికి కృషిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పతాక నిధికి విరాళాలు అందించేవారు డైరెక్టరు, సైనిక సంక్షేమ శాఖ, విజయవాడ వారి అకౌంట్ నెం.33881128795కు నేరుగా జమ చేయాలని లేదా జిల్లా సైనిక సంక్షేమాధికారి, శ్రీకాకుళం పేరున చెక్కు డ్రాఫ్టును తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, పెద్ద రెల్లి వీధి, శ్రీకాకుళం వారికి పంపవలసినదిగా కోరారు. పతాక నిధికి మీరు అందిచే విరాళాలకు ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుందని తెలిపారు. అనంతరం స్థానిక పెద్ద రెల్లి వీధిలోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయములో పతాక దినోత్సవ వేడుకలను జిల్లా సైనిక సంక్షేమాధికారి జి. సత్యానందం ప్రారంబించారు. ఈ కార్యక్రమములో మాజీ సైనిక సంఘం సభ్యులు, గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, సుబేధర్ సూర్యనారాయణ, హవల్దార్ రవికుమార్ మరియు యన్.సి.సి. ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆదినాయణ మరియు జిల్లా సైనిక సంక్షేమ కార్యలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.