జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 9,600 మంది వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఈ పథకం క్రింద సుమారు రూ.10కోట్లు వసూలయ్యిందని అన్నారు. వీరందరికి రెండు రోజుల్లో రిజిష్ట్రేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ప్రతీ లబ్దిదారుడికి రిజిష్ట్రేషన్ చేసేందుకు మూడు సెట్ల రిజిష్ట్రేషన్ పత్రాలు వస్తాయని, ఇలా ఇప్పటివరకు జిల్లాకు 2,800 సెట్లు వచ్చాయని తెలిపారు. జిల్లాలో ఇంతవరకు 130 రిజిష్ట్రేషన్లు జరిగాయని, మిగిలినవారికి కూడా రెండు రోజుల్లో రిజిష్ట్రేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు సెట్లలో ఒకటి లబ్దిదారునికి ఇస్తారని, ఒకటి సచివాలయంలో, మరొకటి సబ్ రిజిష్ట్రార్ వద్దా ఉంటుందని తెలిపారు. తాశీల్దార్ విక్రయదారునిగా, లబ్దిదారుడు కొనుగోలుదారుడిగా ఈ రిజిష్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు.
2000-2004 సంవత్సరాల మధ్య అప్పటి ప్రభుత్వం ప్రకటించిన ఒన్‌టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని వినియోగించుకున్నవారికి, ప్రస్తుతం కేవలం రూ.10కే రిజిష్ట్రేషన్ చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. అప్పట్లో డబ్బు చెల్లించినవారికి, నో డ్యూస్ సర్టిఫికేట్‌ను మాత్రమే అందజేయడం జరిగిందన్నారు. అటువంటి వారికి కూడా ఇప్పుడు రిజిష్ట్రేషన్లను జరపాలని ఆదేశించారు. దీనికోసం లబ్దిదారులు తమ పాసుపుస్తకం లేదా నో డ్యూస్ సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు.ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, హౌసింగ్ పిడి కూర్మినాయుడు, జిల్లా రిజిష్ట్రార్, తాశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.