గృహనిర్మాణాలు వేగవంతం చేయండి..కలెక్టర్
Ens Balu
8
Vizianagaram
2021-12-16 07:07:44
విజయనగరంజిల్లాలో గృహనిర్మాణ లబ్దిదారులకు ప్రభుత్వం బిల్లులను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సుమారు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఇప్పటివరకు లబ్దిదారుల ఖాతాల్లో రూ.50కోట్లు వరకు జమ అయ్యిందని తెలిపారు. మిగిలిన బిల్లులు కూడా రెండుమూడు రోజుల్లో దశలవారీగా జమ అవుతాయని తెలిపారు. జగనన్న కాలనీల లబ్దిదారులకు ఉచితంగా ఇసుకను, తక్కువ ధరకు సిమ్మెంటు, స్టీలును సరఫరా చేయడం జరుగుతోందని చెప్పారు. ఇలా ఇప్పటివరకు సుమారు రూ.96లక్షల విలువైన సిమెంటు, స్టీలును అందజేయడం జరిగిందన్నారు. సిమ్మెంటు బస్తా రూ.242 చొప్పున, ప్రతీ ఇంటికి 90 బస్తాలను, టన్ను ధర రూ.56,000 చొప్పున ఇంటికి 470 కిలోల ఐరన్ రాడ్లు (8 మి.మీ, 10 మి.మీ, 12 మి.మీ) సరఫరా చేయడం జరుగుతోందన్నారు. ప్రతీ ఇంటికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామన్నారు. లబ్దిదారులు పెదతాడివాడ, కొత్తవలస, బొబ్బిలి స్టాక్ పాయింట్లనుంచి ఇసుకను తీసుకొనే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని, త్వరగా తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ కోరారు.