ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు-జిల్లా కలెక్టర్
Ens Balu
3
Kakinada
2021-12-18 07:52:32
తూర్పుగోదావరి జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ హరికిరణ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదామును పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్ రత్నబాబు, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, కొల్లాబత్తుల అప్పారావు (టీడీపీ), రావూరి వెంకటేశ్వరరావు (వైసీపీ), చెక్క రమేష్ బాబు (భాజపా), సుబ్బారపు అప్పారావు (బీఎస్పీ), కె.పోతురాజు (కాంగ్రెస్), కాకినాడ పట్టణ తహసీల్దార్ వైహెచ్ఎస్ సతీష్, కలెక్టరేట్, పట్టణ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు ఎం.జగన్నాథం, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.