నూతన్ నాయుడు నకిలీ లీలలుపై రూ.12 కోట్ల కేసు..


Ens Balu
1
Visakhapatnam
2020-09-14 21:17:57

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  దర్శకుడు నూతన్‌ నాయుడు లీలలు ఒక్కొక్కటీగా  బయటకు వస్తున్నాయి. ఇతనిపై ఇప్పటికే పలు కేసులు బయటపడగా.. తాజాగా మరో మోసం విశాఖలో వెలుగుచూసింది. ఉద్యోగం పేరిట నూతన్‌ నాయుడు 12 కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆరోపిస్తూ మహారాణి పేట పోలీస్‌ స్టేషన్‌లో ఈరోజు కేసు రిజస్టరైంది. ఎస్‌బీఐలో రీజినల్‌ డైరెక్టర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి 12 కోట్లు వసూలు చేశాడని ఫిర్యాదుపై స్పందించిన విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతామని మీడియాకి చెప్పారు. అంతేకాకుండా మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని కూడా వివరించారు... కాగా సీనియర్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్‌ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్‌ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి.  నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్‌ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించి  సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు...