జగనన్న తోడు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి..


Ens Balu
2
Srikakulam
2020-09-15 14:34:39

శ్రీకాకుళం జిల్లాలో జగనన్న తోడు దరఖాస్తులు త్వరితగతిన పరిశీలించాలని గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి విభాగం సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. జగనన్న తోడు, వై,యస్.ఆర్ బీమా పథకాలపై జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. జిల్లాలో జగనన్న తోడు పథకానికి 34,552 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంబంధిత బ్యాంకులకు పంపిస్తారని చెప్పారు. బ్యాంకులు వారం రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. జగనన్న తోడు, ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల పథకం (పి.యం. స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) క్రింద చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డు జారీ చేయడమే కాకుండా సున్నా వడ్డీకి రూ.10 వేలు రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తాయని వివరించారు. అక్టోబరు 4వ తేదీన జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సంయుక్త కలెక్టర్ చెప్పారు.  బ్యాంకులు సత్వరం ఈ ప్రక్రియను పూర్తి చేసి సహకారాన్ని అందించాలని ఆయన ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకానికి ప్రాధాన్యతను ఇస్తూ చిరు వ్యాపారులకు తోడుగా ఉండాలని సంకల్పించాయని చెప్పారు. వై.యస్.ఆర్ బీమా నమోదు ప్రక్రియ చేపట్టాలి : వై.యస్.ఆర్ బీమా క్రింద అర్హులైన అందరూ నమోదు కావాలని సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. జిల్లాలో బియ్యం కార్డు ఉన్న వారందరూ అర్హులేనని ఆయన పేర్కొన్నారు. వై.యస్.ఆర్ బీమా ప్రీమియంగా పేదల తరపున ప్రభుత్వమే 15 రూపాయలు చెల్లిస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో గతంలో భారీ ఎత్తున జన్ ధన్ ఖాతాలను ప్రారంభించడం జరిగిందని ఆ ఖాతాల పరిస్థితిని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.నగేష్, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి.హరి ప్రసాద్, డిసిసిబి డిజిఎం ప్రసాద్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు