జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో పోరాటం..గంట్ల


Ens Balu
4
Visakhapatnam
2022-01-29 07:52:14

దేశవ్యాప్తంగా జర్నలిస్టు ల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో పోరాటం సాగిస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం విశాఖలోని వైశాఖి జల ఉద్యానవనంలో వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి  ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ,  జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేసిందన్నారు. అయితే వీటిని పునరుద్ధరించాలని ఇప్పటికే తాము జాతీయ జర్నలిస్టుల సంఘం( ఎన్ ఏ జే) తరపున  పార్లమెంటు సబ్ కమిటీకి నివేదిక అందజేసినట్టు గుర్తుచేశారు. అవసరమైతే ఈ అంశాలపై న్యాయ పోరాటం సాగించాలని కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు దశలవారీగా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నామన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు సమస్య తో పాటు పెండింగ్  ప్రధాన సమస్యలు పరిష్కారమవుతాయని శ్రీను బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ అర్బన్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయన్  మాట్లాడుతూ, ప్రతి యేటా సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రమం తప్పకుండా చేపడుతున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సభ్యుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు తమ యూనియన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసరావు, ఏపీ బ్రాడ్ కాస్ట్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ,  ఇతర నేతలు ఎ.సాంబ శివ రావు, మధు,ఆనంద్, పి. నాగేశ్వర రావు, కృష్ణ వేణి, జయశ్రీ, తరుణ్ జ్యోతి, సుజాతా మూర్తి, తదితరలు తో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.