తూర్పుగోదావరి జిల్లాలో పశు కమేలాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన అధికారులు సిబ్బంది ద్వారా డేగ కన్ను వేసినట్టు తెలుస్తుంది. ఇందులోభాగంగానే పశువుల రవాణాపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాలో కొందరు వ్యాపారులు పశువులను తరలించడంతోపాటు, వాటిని కమేలాలకు తరలించి మాంస విక్రయాలు కూడా అత్యధికంగా చేపడుతున్నట్టు అధికారులు సమాచారం అందుకున్నారు. మరికొంత మంది పశువల ఎముకలు, కొవ్వులతో ప్రత్యేకంగా నూనెలు తయారు చేసి కల్తీలకు పాల్పడుతున్నట్టు కూడా తెలియడంతో అలాంటి స్థావరాలు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి నిర్వహకులు ఎవరు, వారికి ఎవరు సహకారం అందిస్తున్నారు, వారి వ్యాపారాలు ఏ ప్రాంతం వేదికగా సాగుతున్నాయి తదితర వివరాలు సేకరించే పనిలో పడినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో మంగళవారం పిఠాపురం టౌన్ స్టేషన్ పరిధిలోని రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ వద్ద రెండు బొలేరో వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గోవులను పోలీసులు గుర్తించినట్టు చెబతున్నారు. అలా గుర్తించిన వాటిపై పిఠాపురం ఎసై శంకర్ రావు కేసును నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతు వాహనంలో ఉన్న 23 ఆవులను కాకినాడ గో సంరక్షణ కేంద్రానికి తరలించి కేసులు నమోదు చేసినట్టు పిఠాపురం సిఐ శ్రీనివాస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గోవుల రవాణా అధికంగా జరుగుతోందని వాటి నియంత్రకు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఆవులను అక్రమంగా రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పిఠాపురం సర్కిల్ పరిధిలో అసాంఘిక, అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అక్రమ రవాణాలపై తమకు సమాచారాన్ని తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసేవారు, మాంస విక్రయాలు చేసేవారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.