బడ్జెట్ పై కార్పొరేటర్లకు అవగాహన కల్పించాలి..


Ens Balu
3
Visakhapatnam
2022-02-04 08:19:19

పదేళ్ల తర్వాత మహావిశాఖ నగరపాలక సంస్థలో పాలకమండలి ఏర్పడింది.. 70% కార్పొరేటర్లు కొత్తవారే..రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ ఆమోదించాలంటే పాలకమండలి సభ్యులు అందరికి బడ్జెట్ పై  పూర్తిగా అవగాహన ఉండాల్సిందే.. స్థాయి సంఘం ప్రతిపాదించిన బడ్జెట్ ను గుడ్డిగా ఆమోదిస్తే ఓటేసిన నగర ప్రజలకు మోసం చేయడమేనని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చెప్పారు.  బడ్జెట్ పై అవగాహన కల్పించడానికి కార్పొరేటర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరుతూ శుక్రవారం జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు అయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ మహా విశాఖ నగర పాలక సంస్థ  నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ తో ఈనెల 11న  బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు  పత్రికల్లో చూసి తెలుసుకునే దౌర్భాగ్యంలో కార్పొరేటర్లు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   కార్పొరేటర్ లతో కూడిన   కౌన్సిల్  బడ్జెట్ ను ఆమోదించడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిశారని గుర్తు చేశారు. ఇప్పుడున్న కౌన్సిల్ సభ్యులు లో 70 శాతం మంది కొత్త వారే కాబట్టి నాలుగు వేల కోట్ల రూపాయల భారీ  బడ్జెట్ ను ఆమోదించేందుకు అందులో చేర్చిన  అంశాలు, నిబంధనలపై కార్పొరేటర్ లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థాయీ సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలను గుడ్డిగా ,యధావిధిగా ఆమోదించకుండా సమగ్ర చర్చ జరిపి నగర ప్రజలు అవసరాలకు అనుగుణంగా  కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ పైన ఇతర అంశాలపైన   సమగ్రమైన, విస్తృతమైన చర్చ జరగాలంటే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు బడ్జెట్ వ్యవహారాలపై కనీస అవగాహన ఉండాలన్నారు. ఇందుకోసం బడ్జెట్ సమావేశానికి ముందు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించాల్సిందిగా జీవీఎంసీ మేయర్, కమిషనర్ల కు విజ్ఞప్తి చేశామని చెప్పారు.  స్థాయీ సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలు అన్నింటినీ ఆ అవగాహన సదస్సు లో కార్పొరేటర్ల ముందు ఉంచవలసిందిగా కోరుమన్నారు. బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధం అయ్యేందుకు కార్పొరేటర్లకు కనీసం  రెండు వారాల ముందు బడ్జెట్ ఎజెండా ప్రతులను అందజేయాలన్నారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ అధికారుల నుంచి బడ్జెట్ సమావేశం పైన  ఎజెండా పైన ఎటువంటి సమాచారం లేకపోవడం దారుణమన్నారు . నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ ను ఆమోదించే ముందు సరైన కసరత్తు  లేకుండా, విషయం  తెలుసుకోకుండా, సభ్యులకు సమాచారం ఇవ్వకుండా హడావిడిగా చేయటం సమంజసం కాదని హితవు పలికారు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ సమావేశాల తేదీ వివరాలను  కార్పోరేటర్ లకు తెలియజేసి, పూర్తి వివరాలతో కూడిన ఎజెండాను సభ్యులకు అంద చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు కార్పొరేటర్లకు అవగాహన కోసం ముందస్తుగా సమావేశాన్ని నిర్వహించాలని కోరారు.