జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు గంట్ల సేవలు వెలకట్టలేనివి.. జియ్యాని శ్రీధర్


Ens Balu
12
Visakhapatnam
2022-02-06 09:32:14

కృషి పట్టుదల ఉంటేనే జీవితంలో సమాజంలో ప్రతి ఒక్కరూ  ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి అవకాశం కలుగుతుందని జివిఎంసి డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ అన్నారు. ఆదివారం విశాఖలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఆవరణలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా 2వ సారినియమితులైన గంట్ల శ్రీనుబాబు సన్మాన సభ జరిగింది. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. గ్రామీణ ప్రాంత జర్నలిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన శ్రీనుబాబు కీలకమైన వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరం అధ్యక్షుడు గా, వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర కార్యదర్శి గా, రెండో సారి జాతీయస్థాయి జర్నలిస్టుల సంఘం నేతగా ఎదగడం, అదే స్థాయిలో తన సేవలు అందించడం తనకు ఎంతో  గర్వకారణంగా ఉందన్నారు. అందుకు తమ బాల్య మిత్రులు అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నామన్నారు.  సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని వారితోనే దేశ ప్రగతి  సాధ్యమన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తమ సొంత గ్రామాన్ని మర్చిపోకుండా శ్రీనుబాబు అందిస్తున్న  సేవలు ప్రశంసనీయమన్నారు. సన్మాన గ్రహీత జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతగానో సహకారం అందించారన్నారు. 1997 నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా జర్నలిస్టుగా సమాజానికి అవసరమయ్యే అనేక కథనాలు రాయడంతో పాటు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తనను ఆదరించిన, అభిమానించిన గ్రామ ప్రజలందరికీ, యువజన సంఘాల కు శ్రీనుబాబు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస, గణేష్, నవయుగ యువజన సేవా సంఘాల తో పాటు గ్రామానికి చెందిన చాకి రేవు కొండ, విజినిగిరిపాలెం, లండ గరువు, మార్కెట్ ప్రాంతాలకు చెందిన  పలువురు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీనుబాబు ను ఘనంగా సన్మానించి సత్కరించారు. దొంతల సంతోష్, గంట్ల కిరణ్ బాబు ఏర్పాట్లు చేశారు..