ఆ ఉద్యోగాలకు విశాఖజిల్లాలో పోటీపడేది 1.55లక్షలు


Ens Balu
3
కలెక్టరేట్
2020-09-15 19:24:52

గ్రామ,వార్డు సచివాలయ  రిక్రూట్ మెంట్ పరీక్షలు  పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళ వారం  నాడు స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ  మందిరం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రిక్రూట్ మెంట్  పరీక్షలు నిర్వహించే అధికారులు, పరీక్షల ప్రారంభానికి ముందు, జరుగుతున్న సమయంలో , పూర్తయిన తర్వాత చేయవలసిన పనుల మీద పూర్తి అవగాహనతో శ్రధ్ధ తో పని చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సీరియస్ గా  తీసుకోవాలని కమిట్ మెంట్ తో పని చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణ లో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా సక్రమంగా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా  పరిశీలించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు విద్యుత్,గాలి, వెలుతురు  సక్రమంగా అందే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆయన అన్నారు. పోలీసు శాఖ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూములకు భద్రత కల్పించాలని, రూట్ అధికారులు మెటీరియల్ తీసుకు వెళ్ళేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలని తెలిపారు. ఈనెల 20 నుంచి  ప్రారంభం కానున్న స‌చివాల‌య ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌ల నిమిత్తం కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌రీక్షా కేంద్రాల‌వ‌ద్ద ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కేంద్రాల్లోకి ప్ర‌వేశించే ప్ర‌తీ అభ్య‌ర్థికీ థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హించి, శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను త‌నిఖీ చేయాల‌న్నారు. శానిటైజ‌ర్ వేసి, చేతులు శుభ్రం చేసుకున్న త‌రువాతే లోప‌లికి పంపించాల‌ని చెప్పారు.  మాస్కులు ధ‌రించిన వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించాలని, అవసరమైతే ఉపయోగించడానికి ప్ర‌తీ కేంద్రంలో మాస్కుల‌ను కూడా రిజ‌ర్వులో ఉంచాల‌ని సూచించారు. కోవిడ్ పాజిటివ్ రోగులు ప‌రీక్ష‌లు రాసేందుకు అనుగుణంగా ప్ర‌తీ ప‌రీక్షా కేంద్రం వ‌ద్దా ప్రత్యేక గదులను  ఏర్పాటు చేస్తామన్నారు.  ప్ర‌తీ ప‌రీక్షా కేంద్రంవ‌ద్ద 2 ఎఎన్ఎం లను, 2 ఆశా కార్యకర్తలను  ఏర్పాటు చేయాల‌ని, శానిటైజ‌ర్లు, మాస్కులు, థ‌ర్మ‌ల్ స్కానర్ లు, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌, అవ‌స‌ర‌మైన‌ మందుల‌ను కూడా సిద్దంగా ఉంచాల‌ని  డిఎంహెచ్ఓ కు సూచించారు.  అభ్య‌ర్థులు ప‌రీక్షా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా ఆర్‌టిసి అధికారులు బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని ఆయన సూచించారు. మెటీరియల్ తీసుకు వెళ్ళేందుకు డిజిటి బస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. మొత్తం 1,50,441 మంది  అభ్యర్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌రు కానున్నారని చెప్పారు.  ఈ నెల 20 నుంచి 26వ తేదీ వ‌ర‌కు,  ఉద‌యం 10 నుంచి 12.30, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌లు వ‌ర‌కూ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్నారు.  ప్ర‌తీ అభ్య‌ర్థి క‌నీసం 45 నిమిషాల‌ ముందు ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంద‌న్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అభ్యర్థుల మ‌ధ్య భౌతిక దూరాన్ని పాటించేందుకు అనువుగా  ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. సెంట‌ర్ల స్పెష‌ల్ ఆఫీస‌ర్లు, రూట్ ఆఫీస‌ర్లు,  ఛీఫ్ సూప‌రింటిండెంట్లు,  అద‌న‌పు ఛీప్ సూప‌రింటిండెంట్లు,  హాల్ సూప‌రింటిండెంట్లను, ఇన్విజిలేట‌ర్లను నియమించినట్లు  వారికి సమగ్ర శిక్షణ ను ఇచ్చినట్లు వివ‌రించారు.  ఈ స‌మావేశంలో  రూరల్ పోలీసు సూపరింటెండెంట్ కృష్ణా రావు,  జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి,  జీవియంసి కమీషనర్ జి.సృజన,  జాయింట్ కలెక్టర్ గోవింద రావు,  నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య,  డి ఆర్ ఓ  ఎ.ప్రసాద్, ఆర్డీఓ కిషోర్,  జిల్లా పరిషత్ సిఈఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, డిఎంహెచ్ఓ విజయ లక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డిటిసి రాజారత్నం, ఈపీసీడీఎల్ ఎస్ ఈ సూర్య ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.