తిరుమలలోని అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలానికి భూమి పూజను ఫిబ్రవరి 16న మాఘ పౌర్ణమి నాడు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఆకాశగంగ వద్ద భూమి పూజ ఏర్పాట్లను ఈవో, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆకాశ గంగ సమీపంలోని అంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలమని భౌగోళిక, పౌరాణిక, శాస్త్రోక్తమైన ఆధారాలతో టిటిడి ధర్మకర్తల మండలి ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, సుందరీకరణ చేపట్టేందుకు టిటిడి ఫిబ్రవరి 16న భూమిపూజ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హనుమంతుని జన్మవృత్తంతంపై పుస్తకం విడుదల చేస్తామన్నారు. అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారి ఆలయం ఎదురుగా ముఖ మండపం, గోపురాలు, గోగర్భం డ్యాం వద్ద రోటరీ దాతల సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు. టిటిడి మాజీ బోర్డు సభ్యులు నాగేశ్వరరావు, మురళీ కృష్ణ ఆర్ధిక సహయంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఆధ్వార్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. విశాఖ శారద పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు, కోటేశ్వర శర్మ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులను ఈ ఉత్సవానికి ఆహ్వానించామన్నారు.
అదేవిధంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఉన్న 1.5 ఎకరాల స్థలం అభివృద్ధి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. ఇక్కడ ధ్యానమందిరం, ఉద్యానవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, బృందావనం అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఈవో చెప్పారు. అంతకుముందు ఈవో ఆకాశగంగ పరిసరాల్లో భూమి పూజ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గోగర్భం డ్యాం, రింగ్ రోడ్డు పరిసరాలలో నూతనంగా అభివృద్ధి చేసిన కూడళ్ళను, తరిగొండ వెంగమాంబ బృందావనంను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సిఇ నాగేశ్వరరావు, ఇంచార్జ్ డిఎఫ్‌వో ప్రశాంతి, ఎస్ఇ -2 జగదీశ్వర్‌రెడ్డి, ఇఇ జగన్మోహన్ రెడ్డి, విజివో బాలిరెడ్డి, మాజీ టిటిడి బోర్డు సభ్యులు నాగేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, ఇతర అధికారులు ఈవో వెంట ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కొరకు ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటల నుండి ఎస్వీబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.