శ్రీకాకుళం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లపై కదలిక..
Ens Balu
9
Srikakulam
2022-02-08 11:04:18
శ్రీకాకుళం నగరంలోని దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్తో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగనన్న చేదోడు కార్యక్రమం నిర్వహణ సందర్భంగా వీరుద్ధరూ పలు అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం వేగవంతం కావాల్సి ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేస్తే పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందని గతంలోనే ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం నిధుల విడుదలకు సానుకూలంగా ఉందని అన్నారు. తగిన నిధులను సమీకరించి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఇదే విధంగా కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణానికి తగిన నిధులు పూర్తిస్థాయిలో కేటాయించాలని ఇటీవలే తాను సీఎం వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి వివరించానని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ స్టేడియం నిర్మాణం విషయంలో తమకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయని అన్నారు. ముఖ్యంగా స్టేడియంను క్రీడాకారులకు అనుకూలంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సీఎంవో నుంచి పేర్కొన్నారన్నారు. ఇందు కోసం స్టేడియం స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేశామన్నారు. ఆటలకు అనుగుణంగా క్రీడామైదానాన్ని చదును చేయిస్తున్నామన్నారు. రన్నింగ్, జాగింగ్ ట్రాక్ ల నిర్మాణం చేశామన్నారు. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. దీనికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ పర్యాటక శాఖ, మున్సిపల్ శాఖల నుంచి కూడా స్టేడియం అభివృద్ధికి నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని త్వరలోనే స్టేడియం నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.